
అన్ని సౌకర్యాలతో ఉపాధి శిక్షణ కేంద్రం ఏర్పాటు
గద్వాల: విద్యార్థులు, యువత భవిష్యత్ కోసం డిజిటల్ లైబ్రరీ, స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాన్ని అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయ భవనంలో తాత్కాలిక డిజిటల్ లైబ్రరీ, స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం ఏర్పాటు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఉపయోగపడేలా బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయ భవనంలో డిజిటల్ లైబ్రరీ, గ్రామీణ ఉపాధి శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పనులన్నీ పర్యవేక్షించి కేంద్రాన్ని త్వరగా ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. డిజిటల్ లైబ్రరీతో విద్యార్ధులు పుస్తకాలతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందే అవకాశం ఉంటుందన్నారు. ఆన్‌లైన్ తరగతులు, పోటీ పరీక్షలకు అవసరమైన సదుపాయాలతో పాటు వివిధ కోర్సులకు సన్నద్ధమయ్యేందుకు ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో గ్రామీణ ఉపాధి శిక్షణ సంస్ధ డైరెక్టర్ శ్రీనివాస్ నాయక్, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.