
సామాన్యులపై దాడులకు పాల్పడుతున్న పోకిరీలు
చర్యలేవి..?
గద్వాల: జిల్లా కేంద్రమైన గద్వాలలో ఇటీవల రౌడీమూకలు రెచ్చిపోతున్నాయి. నిత్యం మద్యం మత్తులో తూగుతూ సామాన్యులతోపాటు ఏకంగా పోలీసులపైనా దాడులకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఈ వీధిరౌడీలు ప్రజలపై విచక్షణా రహితంగా దాడులకు పాల్పడుతున్నా చర్యలు తీసుకునేందుకు ఖాకీలే వెనకంజ వేయడం గమనార్హం. అయితే, కొందరు రాజకీయ నాయకులు ఈ రౌడీమూకలకు రక్షణ కవచంగా ఉంటుండడంతోనే పదుల సంఖ్యలో దాడి ఘటనలు చోటుచేసుకుంటున్నా పోలీసులు సైతం మిన్నకుండిపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గ్యాంగ్‌లుగా ఏర్పడి..
పట్టణంలో మొత్తం జనాభా లక్ష వరకు ఉండగా.. ఇందులో 35శాతం మేర అంటే 35వేల మంది యువత ఉంటారు. వీరిలో చదువు మధ్యలో మానివేసిన వారు, దినసరి కూలీలు చేస్తున్నావారు, జల్సాలకు, మత్తు పదార్థాలకు అలవాటు పడ్డ యువకులు గ్రూపులుగా ఏర్పడ్డారు. ఇలాంటి వాట్సాప్ గ్రూపులు 90కి పైగా ఉన్నట్లు సమాచారం. ఓ యూత్‌కు సంబంధించి ‘చంపు–చావు’ అనే పేరుతో ఏర్పాటు చేసుకున్న వాట్సాప్ గ్రూప్‌పై పెద్ద ఎత్తున దుమారం లేస్తుంది.ఇలా ఏర్పాటు చేసుకున్న గ్రూపుల ద్వారా నిత్యం ఒకరిమరొకరు టచ్‌లో ఉంటూ సమాచారాన్ని బదిలీ చేసుకుంటారు. ఈ క్రమంలోనే ఎక్కడైనా తమ గ్రూప్‌లోని ఫ్రెండ్ ఘర్షణలకు పాల్పడుతుంటే వెంటనే వాట్సప్‌గ్రూప్ ద్వారా సమాచారం తెలుసుకుని నిమిషాల్లో ఘర్షణ జరుగుతున్న స్థలాలకు చేరుకుని దాడులకు పాల్పడుతూ రెచ్చిపోతున్నారు. ప్రధాన పార్టీలకు చెందిన తాజా మాజీ లీడర్లతో పాటు చిన్నాచితక మరో ముగ్గురు లీడర్లు గ్యాంగ్‌లను ఏర్పాటు చేసుకుని అన్ని రకాలుగా పెంచిపోషిస్తూ అండగా నిలబడుతున్నారనేది బహిరంగ రహస్యం. రాజకీయ ప్రాబల్యంతో కొనసాగుతున్న గ్యాంగ్‌లు మందు పార్టీలు చేసుకునే క్రమంలోనే దాడులకు స్కెచ్‌లు వేస్తూ అమలుచేస్తున్నట్లు సమాచారం.
సామాన్యులు బైక్‌పై వెళ్తూ హెల్మెట్ పెట్టుకోకున్నా.. నిబంధనలు పాటించకున్నా పోలీసులు వారిని పట్టుకొని చలాన్లు వేయడం, ఇదేమని ప్రశ్నిస్తే లాఠీలు ఝుళిపించడం చూస్తుంటాం. కానీ, జిల్లా కేంద్రంలో ఆర్నెళ్లలో 40 వరకు దాడి ఘటనలు చోటుచేసుకోవడం, ఇందులో 70మంది వరకు తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా.. వీరిపై దాడికి పాల్పడిన రౌడీమూకలపై మాత్రం పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ప్రజల నుంచి వినవస్తున్నాయి. దాడి ఘటనలకు బాధ్యులుగా పేర్కొంటున్న వీధిరౌడీలకు రాజకీయ నేతలు కొమ్ముకాస్తుండగా.. మరోవైపు రాజకీయ పలుకుబడితో పోస్టింగులు తీసుకున్న కొందరు పోలీసులు సైతం వీధిరౌడీలపై కఠినంగా వ్యవహరించలేకపోతున్నారనే విమర్శలు ఎదుర్కొంటూ అబాసుపాలవుతున్నారు.