
మార్పు వచ్చేనా..?
●
బాధ్యతను గుర్తుచేస్తూ..
మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో రోడ్డు ప్రమాదాల బారిన పడి ఎంతోమంది మృతి చెందారు. గడిచిన 9 నెలల వ్యవధిలో 73మందికిపైగా మృత్యువాతపడ్డారు. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన క్రమంలో మోతాదుకు మించి మద్యం సేవించినట్లు సిబ్బంది గుర్తించారు. అలాంటి వారిని కోర్టులో హజరుపరచగా జరిమానాలు, జైలు శిక్షలు పడుతున్నాయి. అయితే వారిలో ఆశించిన మార్పు రావడంలేదు. ఈక్రమంలో వారిలో పూర్తిస్థాయిలో మార్పు రావాలనే లక్ష్యంతో బాధ్యతను గుర్తు చేస్తూ సామాజిక స్పృహ కల్పించాలనే దిశగా న్యాయశాఖ చర్యలు చేపట్టింది. వారి ఆదేశాల మేరకు డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారితో ఈ శిక్షలను అమలు చేయిస్తున్నాం.
– శ్రీనివాసరావు, ఎస్పీ
గద్వాల క్రైం: జిల్లాలో రోజురోజుకూ పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ ప్రమాదాల్లో 60 నుంచి 80శాతం ప్రమాదాలకు మద్యం సేవించి వాహనాలు నడపడంతోనే అని పోలీసుల రికార్డుల ద్వారా తెలుస్తోంది. మద్యం తాగి వాహనాలు నడపడం.. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టరిత్యా నేరమని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ మద్యం ప్రియులు నిబంధనలు ఉల్లంఘించి పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్నారు. అధికారులు జరిమానాలు విధించి కేసులు నమోదు చేసినా వారిలో మార్పు రావడంలేదు. దీంతో మద్యం ప్రియులకు జరిమానాల కంటే బాధ్యతలను గుర్తు చేయాలనే లక్ష్యంతో న్యాయశాఖ వినూత్న ఆలోచనకు తెరతీసింది. పోలీసులు, సామాన్యులతో కాకుండా.. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారితోనే మద్యం తాగడం వల్ల జరిగే అనర్థాలపై ప్రజలకు, వాహనాదారులకు తెలియజేయాల్సిందిగా శిక్ష అమలు చేసింది. ఈ నెల 11వ తేదీన కేటీదొడ్డి మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మద్యం తాగుతూ పట్టుబడగా వారికి జిల్లా కేంద్రంలో ప్రధాన కూడలిలో ప్లకార్డులను చేత పట్టించి సమాజసేవలో భాగస్వాములను చేయాలని తీర్పు ఇచ్చింది. ఇదే తరహాలో అయిజకు చెందిన మద్యంతాగి పట్టుబడిన క్రమంలో న్యాయమూర్తి సదరు వ్యక్తికి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో 10 మొక్కలు నాటమని సామాజిక సేవ రూపంలో శిక్షను అమలు చేయగా జిల్లా పోలీసుశాఖ శిక్షను అమలు చేశారు.
డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి వినూత్న శిక్ష అమలు
జరిమానాలకు బదులు సమాజసేవలో భాగస్వామ్యం
పట్టుబడిన వారితో అవగాహన కార్యక్రమాలు
మొక్కలు నాటించి బాధ్యత తెలిసేలా చర్యలు
మద్యం సేవించి వాహనాలు నడపడంతోనే అనేక అనర్థాలు
9 నెలల వ్యవధిలో రోడ్డు ప్రమాదాల్లో 73 మంది మృత్యువాత

మార్పు వచ్చేనా..?

మార్పు వచ్చేనా..?