
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి
గద్వాల: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీవోసీ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వారం రాష్ట్రవ్యాప్తంగా గద్వాల జిల్లా 20వ స్థానంలో ఉండగా ఈ వారం 15వ స్థానానికి చేరుకుందని ఇదేస్ఫూర్తితో పనుల్లో వేగం పెంచి పూర్తి చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్‌రావు, డీపీఓ నాగేంద్రం, హౌసింగ్ పీడీ శ్రీనివాస్‌రావు, మున్సిపల్ కమీషనర్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలు
వంద శాతం అమలు చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి పనులను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఐడీవోసీ కార్యాలయంలో కాన్ఫరెన్స్‌హాలులో ఉపాధిహామీ పనుల జాతర–2025పై సమీక్షించారు. గ్రామాల్లో ఉపాధిహామి కూలీలకు పనికల్పించాలని అవసరమైన వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. మండలాల వారీగా పనుల కార్యాచరణ ప్రణాళిక వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా జిల్లాలో నూతనంగా 29 అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణాలు ఏ స్థాయిలో కొనసాగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. నిర్మాణాలు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా పాఠశాలలో టాయిలెట్స్, పశువులపాకాలు, మేకల పాకలు, అజోల్లా యూనిట్లు, చెక్‌డ్యాంలు, పౌల్ట్రీషెడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, డీపీవో నాగేంద్రం, పీఆర్ శాఖడీఈలు, ఏఈలు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.