
యూరియా కోసం రైతుల అగచాట్లు
అలంపూర్: పంటలను కాపాడుకోవడానికి రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎరువుల కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అలంపూర్ పట్టణంలోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద గురువారం తెల్లవారుజాము నుంచే రైతులు యూరియా కోసం బారులు తీరారు. వర్షం పడుతున్నప్పటికి అక్కడే వేచి చూడాల్సి వచ్చింది. అధికారుల వచ్చేలోపు వర్షం తగ్గడంతో యూరియా కోసం క్యూలైన్‌లలో బారులు తీరారు. ప్రధానంగా సుల్తానాపురం, జిల్లెలపాడుతో ఆయా గ్రామాల రైతులు భారీగా తరలిరాగా.. ముందుజాగ్రత్తగా వ్యవసాయ శాఖ అధికారి నాగార్జున్‌రెడ్డి రైతులకు టోకెన్లు అందజేశారు. పీఏసీఎస్ గోదాంకు 450 బస్తాలు వచ్చినట్లు ఏఓ తెలిపారు. రైతులకు ముందస్తుగా టోకెన్లు అందజేసి 225 మంది రైతులకు రెండు బస్తాల చొప్పున యూరియా అందించినట్లు తెలిపారు. సాయంత్రం వరకు పంపిణీ కొనసాగింది. అయితే యూరియా కోసం అధిక సంఖ్యలో రైతులు తరలిరాగా.. చాలామంది నిరాశతో వెనుదిరిగారు.