
శరన్నవరాత్రి ఉత్సవాలు విజయవంతం చేద్దాం
అలంపూర్: శర్ననవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేద్దామని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. అలంపూర్ క్షేత్రంలోని జోగుళాంబ అమ్మవారి ఆలయంలో శరన్న నవరాత్రి ఉత్సవాల పోస్టర్లు, కరపత్రాలను ఈఓ దీప్తితో కలిసి ఎమ్మెల్యే బుధవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలన్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈఓ దీప్తి మాట్లాడుతూ.. ఈ నెల 22వ తేదీ నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని, అక్టోబర్ 2వ తేదిన ముగియనున్నాయన్నారు. 22న ఉదయం 8 గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, సాయంత్రం 6 గంటలకు ధ్వజారోహణం, 29న ఉదయం 10 గంటలకు జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి కల్యాణమహోత్సవం, సాయంత్రం 4.30 గంటలకు జోగుళాంబ అమ్మవారికి సింహ వాహన సేవ ఉంటుందని తెలిపారు. 30న రధోత్సవం, అక్టోబర్ 1న మహార్ణవమి, రాత్రికి కాళరాత్రి పూజ, 2న విజయదశమి రోజు సాయంత్రం 4 గంటలకు శమి పూజ, 6.30 గంటలకు తుంగభద్ర నది హారతి, 7 గంటలకు తెప్పోత్సవం ఉంటుందని తెలిపారు. అదేవిధంగా ఆలయ పాలక మండలి చైర్మన్ నాగేశ్వర్‌రెడ్డి, ఈఓ దీప్తి పాలక మండలి సభ్యులతో కలిసి దేవి శరన్న నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికలు, పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ధర్మకర్తలు జగదీశ్వర్ గౌడ్, గోపాల్, జి. వెంకటేశ్వర్లు, విశ్వనాథ రెడ్డి, ఆలయ అర్చకులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.
ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
అంతకుముందు ఎమ్మెల్యే బాలబ్రహ్మేశ్వర స్వామి, శ్రీజోగుళాంబ అమ్మవారి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేను శేషవస్త్రాలతో సత్కరించారు. తీర్ధ ప్రసాదాలను అందజేసి ఆశీర్వచనం పలికారు.
ఆలయాల్లో వెంటాడుతున్న రాజకీయాలు
దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లోనూ రాజకీయాలు వెంటాడుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆదిపత్య పోరు కొనసాగుతోంది. దేవి శరన్నవవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే విజయుడు ఆలయ ఈఓ దీప్తితో కలిసి మొదట ఉత్సవాల పోస్టర్లు, ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఆలయ పాలక మండలి దూరంగా ఉంది. అనంతరం పాలక మండలి కార్యాలయంలో ఆలయ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, ఈఓ దీప్తితోపాటు పాలక మండలి సభ్యులతో కలిసి పోస్టర్లు, ఆహ్వాన పత్రికను మరోసారి ఆవిష్కరించారు. ఒక కార్యక్రమాన్ని వేర్వేరుగా చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన ఆలయాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆదిపత్య పోరుకు దిగడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.