
అంకితభావంతో విధులు నిర్వర్తించాలి
● ప్రజా సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం వహించొద్దు
● కలెక్టర్ బీఎం సంతోష్
గద్వాల: ప్రభుత్వ విధులను అంకితభావంతో నిర్వర్తించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణతో కలిసి గ్రామపాలన అధికారుల కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జీపీఓలు ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అభ్యర్థి సొంత నియోజకవర్గం కాకుండా ఇతర నియోజకవర్గంలో మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. అలంపూర్ నియోజకవర్గానికి 57మంది, గద్వాల నియోజకవర్గానికి 22మంది జీపీఓలను నియమించినట్లు వెల్లడించారు. గ్రామపాలన అధికారి విధులతో పాటు ప్రస్తుతం నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ విధులు కూడా నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు.
కాళోజీ జీవితం.. స్ఫూర్తిదాయకం
కాలాన్ని ఆయుధంగా మార్చుకొని తన కవిత్వం, రచనలతో ప్రజల్లో చైతన్యం నింపిన మహనీయుడు కాళోజీ నారాయణరావు అని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. కలెక్టరేట్‌లో ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ.. తెలుగుభాష, ప్రజల అవసరాల కోసం తన జీవితాన్నే త్యాగం చేశారన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన చూపిన మార్గాన్ని అనుసరించి ప్రజలకు సేవచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్‌రావు, ఏఓ భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు
అయిజ/మల్దకల్: ఉపాధ్యాయులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ బీఎం సంతోష్ హెచ్చరించారు. మంగళవారం అయిజ బాలుర ఉన్నత పాఠశాలలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అయితే పాఠశాలలో విద్యార్థులెవరూ లేకపోవడంతో హెచ్‌ఎం శేషపాణి శర్మను నిలదీశారు. మాలపున్నమి పండుగ కావడంతో విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారని హెచ్‌ఎం సమాధానం చెప్పడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా విద్యార్థులకు సెలవు ఇచ్చిన హెచ్‌ఎంను సస్పెన్షన్ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఫోన్‌లో ఆదేశించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. తక్కువ ఖర్చుతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకునే విధంగా లబ్ధిదారులను చైతన్యపరచాలని మున్సిపల్ కమిషనర్ సీహెచ్ సైదులుకు సూచించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ మేనేజర్ అశోక్‌రెడ్డి, హౌసింగ్ ఏఈ వంశీ ఉన్నారు.
మల్దకల్ కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గతేడాది సాధించిన పదో తరగతి ఫలితాలపై ఆరా తీశారు. ఈ ఏడాది వందశాతం ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం తరగతి గదులను కలెక్టర్ సందర్శించి విద్యార్థినుల అభ్యసన సామర్థ్యాలను తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థిని క్రమశిక్షణతో చదువుకొని పాఠశాల, తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలని సూచించారు. అదే విధంగా విద్యార్థినుల కోసం వండిన ఆహారాన్ని పరిశీలించారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ప్రత్యేకాధికారి విజయలక్ష్మికి సూచించారు.