
అధిక ధరలకు యూరియా విక్రయిస్తే చర్యలు
ఎర్రవల్లి/అలంపూర్ రూరల్: యూరియా కొరత పేరుతో రైతులకు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయశాఖ అధికారి సక్రియా నాయక్ అన్నారు. మంగళవారం ఎర్రవల్లి మండలం కొండేరులోని ఫర్టిలైజర్ దుకాణంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎరువుల నిల్వలతో పాటు రికార్డులను పరిశీలించారు. అదే విధంగా అలంపూర్ మండలం క్యాతూర్ పీఏసీఎస్‌లో యూరియా స్టాక్ వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ.. ప్రతి రైతు వివరాలను ఈ పాస్‌లో నమోదు చేసిన తర్వాతే ఎరువులు విక్రయించాలని సూచించారు. యూరియాతో పాటు ఇతర ఎరువులు లేదా గుళికలను బలవంతంగా అంటగట్టవద్దన్నారు. రెండోసారి యూరియా వినియోగించే రైతులు వందశాతం నీటిలో కరిగే నానో డీఏపీ, నానో యూరి యా పిచికారీ చేయాలని సూచించారు. క్యాతూర్ పీఏసీఎస్‌లో ప్రస్తుతం 450 బస్తాల యూరియా అందుబాటులో ఉందని.. ఇప్పటి వరకు 4,150 బస్తాలు పంపిణీ చేసినట్లు వివరించారు. డీఏఓ వెంట ఏఓ నాగార్జునరెడ్డి, సీఈఓ హుస్సేన్ ఉన్నారు.