
అడ్డుకుంటున్నది ఎవరు..?
గద్వాల: ప్రభుత్వం ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇవ్వాల్సిందిగా ఆయా సీజన్లలో మొత్తం రూ.50 కోట్ల విలువైన ధాన్యాన్ని కేటీదొడ్డి మండలం నందిన్నె వద్ద ఉన్న రైస్‌మిల్లుకు కేటాయించగా.. సదరు మిల్లు యజమాని అందులో నుంచి రూ.7.80 కోట్ల ధాన్యాన్ని పక్కదారి పట్టించాడు. రాష్ట్ర విజిలెన్స్ అధికారులు విచారించి అక్రమాలు జరిగాయని నిర్ధారించి ఆర్‌ఆర్ యాక్టు కింద నోటీసులు సైతం జారీ చేశారు. ఐదు రోజుల క్రితం స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా.. నేటికీ ఎఫ్‌ఐఆర్ నమోదు కాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. రాజకీయ పలుకుబడితో క్రిమినల్ కేసు నమోదు కాకుండా సదరు మిల్లు యజమాని శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా, ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టిన సదరు రైస్‌మిల్లు యజమానికి అండగా నిలబడి క్రిమినల్ కేసు కాకుండా అడ్డుపడుతున్న ఆ ఽఖద్దరు నేత ఎవరన్నది జిల్లాలో తీవ్ర చర్చనీయమైంది.
రూ.7.80 కోట్లు స్వాహా
కేటీదొడ్డి మండలం నందిన్నెలోని కమ్మిడిస్వామి రైస్‌మిల్లుకు సివిల్‌సప్‌లై శాఖ అధికారులు 2022 రబీలో 1425.520 మె.టన్నుల ధాన్యం, 2024ఖరీఫ్‌లో 5948.560 మె.ట. 2024–25 రబీలో 10,294.680 మె.ట. మొత్తంగా రూ.50 కోట్ల విలువ గల ధాన్యాన్ని కేటాయించారు. కానీ, నేటికీ చాలామటుకు బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి అందించలేదు. దీంతో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో కమ్మిడిస్వామి రైస్‌మిల్లులో విజిలెన్స్ అధికారులు గత నెల రెండు రోజుల పాటు సోదాలు నిర్వహించారు. రూ.7.80 కోట్ల విలువ గల ధాన్యాన్ని స్వాహా చేసినట్లు లెక్కతేల్చారు. ఈనివేదికను ఆధారంగానే అధికారులు సదరు రైస్‌మిల్లు యజమానిపై చర్యలకు ఉపక్రమించారు. అయితే, తనపై కేసు నమోదు చేయాలంటే అషామాషీ కాదంటూ అటు సివిల్‌సప్‌లైశాఖ, ఇటు పోలీసుశాఖ అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ నెల 4వ తేదీన కెటి.దొడ్డి ఠాణాలో ఫిర్యాదు చేసినప్పటికీ 5రోజులు గడుస్తున్నా ఇంకా ఎఫ్‌ఐఆర్ నమోదు కాకపోవడం విమర్శలకు నిజమేనని ఊతమిస్తున్నాయి. అటు రాష్ట్ర విజిలెన్స్ అధికారులు విచారణ అనంతరం వెలుగుచూసిన అక్రమాలపై మిల్లు ఓనర్ వీరన్నకు ఇదివరకే ఆర్‌ఆర్ యాక్టుకింద నోటీసులు జారీ చేశారు. క్రిమినల్ కేసు నమోదు కాకుండా అక్రమాల నుంచి తప్పించుకునేందుకు మిల్లు ఓనర్ తనకున్న రాజకీయబలంతో శతవిధాలుగా యత్నిస్తున్నట్లు సమాచారం.
పోలీసులకు ఫిర్యాదు
విజిలెన్స్ అధికారులు ఇచ్చిన నివేదిక మేరకు రూ.7.80 కోట్ల విలువ గల ధాన్యానికి సంబంధించి ఇదివరకే ఆర్‌ఆర్ యాక్టు కింద కేటీదొడ్డి తహసీల్దార్ ద్వారా మిల్లర్‌కు నోటీసులు ఇవ్వడం జరిగింది. మిల్లు యజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఈ నెల 4వ తేదీనాడు కెటి.దొడ్డి పోలీసుస్టేషన్‌లో ఎస్‌ఐ శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశాను. ఇంకా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు.
– విమల, సివిల్ సప్లై డీఎం, గద్వాల
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు..
సివిల్ సప్‌లైశాఖ డీఎం విమల ఫిర్యాదు చేశారు. అయితే స్వాహా చేసిన ధాన్యం విలువ రూ.7.80 కోట్లు ఉండడంతో దీనిపై ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసు నమోదు చేస్తాం.
– శ్రీనివాస్, ఎస్‌ఐ, కేటీదొడ్డి
కొమ్ముకాస్తున్న వారెవరు..
ప్రభుత్వం వద్ద తీసుకున్న రూ.50కోట్ల ధాన్యంలో రూ.7.80కోట్ల ధాన్యాన్ని స్వాహాచేసిన రైస్‌మిల్లు ఓనర్‌పై క్రిమినల్ కేసు నమోదు కాకుండా ప్రభుత్వంలో కీలకంగా పనిచేస్తున్న ఓ ఖద్దరు నేత కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కాజేసిన ప్రభుత్వసొమ్మును అవినీతిపరుడి నుంచి కక్కించాల్సిపోయి అందుకు భిన్నంగా కొమ్ముకాయడమేమిటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకు అక్రమార్కుడికి కొమ్ముకాస్తున్న ఆఖద్దరు నేత ఎవరన్నది ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది.
బియ్యం పక్కదారి పట్టించిన మిల్లు యజమానిపై ఫిర్యాదు
ఐదు రోజులైనా ఎఫ్‌ఐఆర్ నమోదుచేయకపోవడంపై అనుమానాలు
ఇదివరకే ఆర్‌ఆర్ యాక్ట్ కింద నోటీసులు
కేసు నమోదు కాకుండా కొమ్ముకాస్తున్నఆ నేత ఎవరనే దానిపై చర్చ