
ప్రజావాణికి 55 ఫిర్యాదులు
గద్వాల: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 55 ఫిర్యాదులు అందాయి. కలెక్టర్ బీఎం సంతోష్ నేరుగా ప్రజలతో ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఫిర్యాదులను ఆయా శాఖలకు చెందిన అధికారులను పిలిచి ఆరా తీశారు. వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, పరిష్కారం కానిపక్షంలో అందుకు గల కారణాలు వివరిస్తూ సంబంధిత ఫిర్యాదుదారుడికి అక్‌నాలెడ్డ్‌మెంట్ ద్వారా తెలియజేయాలని సూచించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్‌రావు కలెక్టరేట్ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
నకిలీ పట్టాలతో పరిహారం స్వాహాకు యత్నం
గట్టు: ముచ్చోనిపల్లె రిజర్యాయర్‌కు సంబంధించి నకిలీ పట్టా సర్టిఫికెట్లతో పరిహారాన్ని స్వాహా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనిని అడ్డుకోవాలని తప్పెట్లమొర్సు గ్రామస్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. 109 ప్యాకేజీలో భాగంగా నిర్మిస్తున్న ముచ్చోనిపల్లె రిజర్వాయర్‌లో ముంపునకు గురైన సర్వే నెంబర్లు 82, 241, 244లలోని ప్రభుత్వ భూమికి సంబందించి గొర్లఖాన్‌దొడ్డి గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు అక్రమంగా నకిలీ పట్టాలను సృష్టించి నష్టపరిహారాన్ని స్వాహా చేసేందుకు ప్రయత్నస్తున్నట్లు తప్పెట్లమొర్సు గ్రామానికి చెందిన వీరన్నగౌడు, ముక్కెరన్నలు ఆరోపించారు. దాదాపు రూ.9 లక్షలు ప్రభుత్వ సొమ్ము కాజేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్లు ఆరోపించారు. ఈ వ్యహారంపై విచారణ నిర్వహించి, ప్రభుత్వ సోమ్ము అక్రమార్కుల పాలు కాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు అందజేసిన ఫిర్యాదులో వారు పేర్కోన్నారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 14 అర్జీలు
గద్వాల క్రైం: ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్‌కు 14 అర్జీలు వచ్చినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ప్రధానంగా భూ వివాదం, ఆస్తి తగదాలు, అప్పుగా తీసుకున్న వ్యక్తులు డబ్బులు చెల్లించడం లేదని ఫిర్యాదులు అందాయన్నారు. వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరిస్తామని, సివిల్ సమస్యలు కోర్టు ద్వారా పరిష్కారం చేసుకోవాలని ఫిర్యాదుదారులకు సూచించారు.