
‘అక్షరాలా’.. నిర్లక్ష్యమే!
ప్రస్తుతం.. ఆవశ్యం..
తరం మారింది.. మనిషి ఆలోచనా విధానం మారింది. సాంకేతికంగా అడుగు ముందుకు వేస్తున్నాడు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఉన్న ప్రతి పిల్లవాడి తల్లిదండ్రుల ఆలోచనా విధానం మారింది. గతంలో దీనికి భిన్నంగా ఉండేది. ఇప్పుడు తమ పిల్లలను ఉన్నతంగా చదివించేందుకు తల్లిదండ్రులు ప్రాముఖ్యం ఇస్తున్నారు. మంచి పాఠశాలలను ఎంపిక చేసుకుని మరీ పంపిస్తున్నారు. అయితే కొంతమందికి చదువు రాకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినా వెనుకడుగు మాత్రం వేయడం లేదు. ఈ తరుణంలో ముఖ్యంగా విద్యాభివృద్ధికి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలకు ప్రత్యేకంగా వసతి గృహాలు, గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలు, బాలికల విధ్యాభివృద్ధి కోసం కేజీబీవీ పాఠశాలలను ప్రభుత్వం నెలకొల్సింది. వయోజనులు సైతం కొద్దిపాటి అక్షరజ్ఞానంతో కొన్నింటిని అందిపుచ్చుకుంటున్నారు. ఈ తరుణంలో చదువుకున్న ప్రతి ఒక్కరూ తమ గ్రామంలో నిరక్షరాస్యులను ఆక్షరాస్యులుగా మార్చాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా నడిపించాలి. మనకెందుకులే అనే ధోరణిని వదిలి సామాజిక బాధ్యతగా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఉపాధి క్షేత్ర సహాయకులు, డ్వాక్రా సంఘాలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, యువత, సేవా సంస్థలు దీనిపై దృష్టి సారించి దేశాన్ని సంపూర్ణ అక్షరాస్యత దేశంగా మార్చేందుకు కృషి చేయాలి.
గద్వాలటౌన్: అభివృద్ధితో పాటు అక్షరాస్యతలోనూ జిల్లా వెనకబడుతోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే కార్యక్రమాలను ప్రభుత్వం నిరంతరంగా అమలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో లోపాలు.. పల్లెల్లోని నిరక్షరాస్యుల అవగాహనా రాహిత్యంలో అక్షరసుమాలను వెదజల్లలేకపోతోంది. ‘ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు’ అంటారు కానీ మహిళలే అక్షరాస్యతలో వెనుకబడిపోతున్నారు. నేటికి జిల్లాలోని గ్రామీణ ప్రజలు వేలిముద్రలు వేసే స్థాయిలోనే ఉన్నారంటే అక్షరాస్యత ఏ దుర్గతిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సోమవారం ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
ఐదేళ్లుగా చర్యలు చేపడుతున్నా..
జిల్లా వంద శాతం అక్షరాస్యతను సాధించడంలో పూర్తిగా తడబడుతోంది. 2011 లెక్కల ప్రకారం జిల్లా జనాభా 6,09,990 ఉండగా వారిలో 3,09,274 మంది పురుషులు, 3,00,716 మంది మహిళలు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. వీరిలో 3,04,202 మంది నేటికీ నిరక్షరాస్యులుగానే ఉన్నట్లు అధికార లెక్కలే చెబుతున్నాయి. జిల్లా అక్షరాస్యత శాతం 49.87 శాతం ఉండగా, వీరిలో పురుషులు 60.05 శాతం, మహిళలు 39.48 శాతం ఉన్నారు. రాష్ట్రంలోనే గద్వాల జిల్లాలోని మూడు మండలాలు అక్షరాస్యతలో వెనుకబడ్డాయి. కేటీదొడ్డి, గట్టు, ధరూర్ మండలాలు కింది వరసలో ఉండటం దారుణం. కేటీదొడ్డి మండలంలో 33.77 శాతం అక్షరాస్యత నమోదై ఉండటం ఆందోళన కలిగిస్తుంది. గతంతో పోలిస్తే అక్షరాస్యతలో కొంత పెరుగుదల కనిపిస్తున్నా జిల్లాలో వంద శాతం సాధించడంలో వెనుకబడిపోతున్నాం. జిల్లాలో ప్రధానంగా పేదరికం, వలసలు, అనర్థాలకు కారణం చాలా సందర్భాల్లో నిరక్షరాస్యతే కారణమవుతోంది. దీంతో పాటు బాలకార్మిక వ్యవస్థ జిల్లాలో పట్టి పీడిస్తుంది. సంపూర్ల అక్షరాస్యత కోసం జిల్లా యంత్రాంగం గత అయిదేళ్లుగా చేపడుతున్నా చర్యలు నేటికీ తడబడుతూనే ఉన్నాయి. 2010లో గ్రామాలలో ఏర్పాటు చేసిన సాక్షర భారత్ కేంద్రాలు మూతపడ్డాయి. వీటి గడువు ముగియడంతో.. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి కార్యక్రమాలను చేపట్టలేదు. ‘ మీ పిల్లలే.. మీకు టీచర్లు.. ’ అనే కార్యక్రమాన్ని విద్యాశాఖ చేపట్టిన ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు.
కొరవడిన పర్యవేక్షణ
జిల్లాలో వయోజన విద్యా శాఖ ఆధ్వర్యంలో వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే కార్యక్రమాలు పర్యవేక్షణ కొరవడి, ప్రోత్సాహకాలు లేక చతికిలపడిపోయాయి. గతంలో ఉన్న వయోజన విద్యా కేంద్రాలు ప్రశ్నార్థకంగా మారాయి. గత తొమ్మిదేళ్లుగా జిల్లా అన్ని రంగాల్లో కాస్తోకూస్తో అభివృద్ధి చెందుతున్న అక్షరాస్యతలో మాత్రం ఆ ఘనతను సాధించలేకపోతోంది. ఇప్పటికీ జిల్లా అక్షరాస్యత 49.87 శాతంతో నిలుస్తుడటం గమనార్హం. ముఖ్యంగా మహిళలు 60శాతానికి పైగా అక్షరాస్యతకు దూరంగా నిలుస్తున్నారు.
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడంలో జిల్లా తడబాటు
చదువు నేర్వని మహిళలే అధికం
జిల్లా అక్షరాస్యత 49.87 శాతం
నేడు ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం
ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం..
జిల్లాను సంపూర్ణ అక్షరాస్యత గల జిల్లాగా తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగం ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రణాళికబద్ధంగా కృషి చేస్తున్నాం. పలు గ్రామాలు ఈ దిశగా వృద్ధిలో ఉన్నాయి. మొదటి నుంచి ఎక్కవ శాతం నిరక్షరాస్యత గత గ్రామాలు అక్షరాస్యత సాధించేందుకు సమయం తీసుకుంటున్నాయి. అక్షరాస్యత కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. – అబ్దుల్ ఘనీ, డీఈఓ

‘అక్షరాలా’.. నిర్లక్ష్యమే!