
ఇంత నిర్లక్ష్యమా..?
● ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు
● చేతికి అందే ఎత్తులో వైర్లు.. రక్షణ కంచె లేకపోవడంతో తరచూ ప్రమాదాలు
● విద్యుదాఘాతంతో మూగజీవాల మృతి
అయిజ: విద్యుత్ సరఫరా వ్యవస్థలో ట్రాన్స్‌ఫార్మర్లు కీలక భూమిక పోషిస్తాయి. అయితే రోడ్డు పక్కన, ముఖ్య కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో ఉండే ఈ ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద రక్షణకు పెన్సింగ్ లేకపోవడంతో అనేక ప్రమాదాలు సంభవిస్తున్నాయి. జిల్లాలోని మొత్తం ట్రాన్స్‌ఫార్మర్లలో కనీసం 10 శాతం ట్రాన్స్‌ఫార్మర్లకు కంచె ఏర్పాటు చేయలేదు. దీంతో జిల్లాలో ఎక్కడో ఓ చోట తరచూ మూగజీవాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా పట్టణాలు, గ్రామాల్లో రద్దీ ప్రాంతాల్లో ట్రాన్స్‌ఫార్మర్లలో పలుమార్లు వైర్లు షార్ట్ సర్క్యూట్ కావడంతో నిప్పురవ్వలు ఎగసి పడుతున్నాయని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ రక్షణ వలయం ఏర్పాటు చేయాలని అధికారులకు పలుమార్లు విన్నవించినప్పటికీ పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌ను అనుకుని ఏర్పాటు చేసిన పండ్లు, పూలు దుకాణాల కారణంగా ట్రాఫిక్ సమస్యతోపాటు జనం రద్దీ సమయంలో షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు సంభవిస్తాయని ప్రజలు, ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా పిల్లలకు సైతం ప్రమాదం పొంచి ఉంది. గత నెలలో అయిజ మండలంలోని ఎక్లాస్‌పురం గ్రామంలో విద్యుత్ వైర్లు తగిలి రెండు గెర్రెలు మృతిచెందాయి. ఇప్పటికై నా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ రక్షణ వలయం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
సామర్థ్యం మొత్తం ట్రాన్స్‌ఫార్మర్లు
(కేవీఏల్లో)
10 కేవీఏ 1,433
15 1,677
25 12,692
63 1,003
100 2,037
160 87
200 2
250 6
315 2
500 2
చర్యలు చేపడతాం
జిల్లాలో గతంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు కట్టలపై అమర్చడంపై ఎక్కువ ఎత్తులో లేవు. వాటిచుట్టూ ఫెన్సింగ్ (కంచె) ఏర్పాటు చేస్తే ప్రజలు వాటిని చెత్తబుట్టలుగా వాడుకుంటున్నారు. అన్ని ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్లింత్ రైజింగ్ చేయించి ప్రమాదాల నుంచి తప్పిస్తాం. ఇందుకోసం నిధులు విడుదల కావాల్సి ఉంది. – శ్రీనివాసరెడ్డి, ట్రాన్స్‌కో ఎస్‌ఈ

ఇంత నిర్లక్ష్యమా..?