
రైతు ఆగమాగం
అధిక వర్షాలకు
దెబ్బతింటున్న పంటలు
● కంది, వేరుశనగతోపాటు ప్రధాన పంటలకు తెగుళ్ల ముప్పు
● నష్ట పరిహారంపైనే ఆశలు
పంట నష్టపరిహారం
అందించాలి
అధిక వర్షాలకు పంటలు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. దిగుబడి కూడా ఘన నీయంగా పడిపోయే అవకాశం ఉంది. పంటల సాగుకు ఎకరాకు రూ.30 వేల నుంచి రూ. 50 వేలవరకు ఖర్చుచేశారు. పత్తి, మిరుప, వేరుశనుగ పంటలు పూర్తిగా తెబ్బతిన్నాయి. ఇప్పుడు వర్షాలు కురవకపోయినా పంటలు కోలుకునే పరిస్థితిలో లేవు. ప్రభుత్వం నష్టపరిహారం అందించాలి.
– జగన్నాథరెడ్డి, రైతు, అయిజ
దిక్కుతోచడంలేదు..
రైతులు సాగుచేసిన పంటలన్ని భారీ వర్షాలకు ఆగమయ్యాయి. కనీసం సస్యరక్షణ చర్యలు చేపడదాం అనుకున్నా వర్షాలు ఆగడంలేదు. ఏ పంట కూడా ఆరోగ్యంగా లేదు. అతి వర్షాలతో రైతులు అన్ని విధాలుగా నష్టపోయారు. ఎన్ని మందులు పిచికారి చేసినా లాభం లేకుండా పోతోంది. రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి.
– లింగన్న, రైతు, అయిజ
అయిజ: రోజుల తరబడి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలతో భూమిలో తేమశాతం ఎక్కువై ఆయా పంటలకు వేరుకుళ్లు రావడంతో మొక్కలు బలహీనపడుతున్నాయి. అదేవిధంగా తెగుళ్లు, పురుగులు ఆశించి పంటలను దెబ్బతీస్తున్నాయి. దీనివలన రైతన్నలు అపారంగా నష్టపోతున్నారు. ఒక్క అయిజ మండలంలో సుమారు 59 వేల ఎకరాలు పంట భూములున్నాయి. వానాకాలం సాగులో భాగంగా సుమారు 40 వేల ఎకరాలలో అన్నదాతలు వివిధ పంటలు సాగుచేసారు. ముఖ్యంగా పత్తి, విత్తనపత్తి, కంది, మిరుప, వేరుశనుగ పంటలు సాగుచేయగా కొందరు రైతులు బొప్పాయి పంటను సాగుచేశారు.
పంటలపై తీవ్ర ప్రభావం
దాదాపు 20 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రధాన పంటలన్ని దెబ్బతిన్నాయి. ముఖ్యంగా పత్తి పంటకు వేరుకుళ్లు తెగులు ఆశించింది. పూత, కాయదశలో ఉన్న పత్తి పంట దెబ్బతింది. భూమిలో తేమశాతం ఎక్కువై పూత పూయడంలేదు. పిందెలు, కాయలు రాలిపోతున్నాయి. పురుగు ఉధృతి అధికమవుతోంది. మందులు పిచికారీ చేసిన కొద్దిసేపటికే మళ్లీ వర్షాలు కురుస్తుండడంతో మార్పు కానరావడంలేదు. తెగుళ్లు అంతకంతకూ విస్తరిస్తున్నాయి. కంది పంటకు ఎక్కువగా వేరుకుళ్లు తెగులు ఆశించింది. ఉల్లి గడ్డలు పంట పొలంలోనే మురిగిపోతుండగా.. వేరుశనుగ కాయలు పొలాల్లోనే మొలకలు వస్తున్నాయి. రైతులు సాగుచేసిన బొప్పాయి పంటకు వైరస్ ఆశించి మొక్కలు తెలుపురంగులోకి మారాయి. ఎదుగుదల లేక గిడసబారాయి.

రైతు ఆగమాగం