
‘గూడు’ కల చెదిరింది !
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ జోక్యం
ఎంపికలో రాజకీయమే
ఇందిరమ్మ ఇళ్ల అర్హుల ఎంపికలో రాజకీయం చోటుచేసుకుందని, నేతలు సిఫారసు చేసిన అనర్హులకు ఇళ్లు మంజూరీ చేశారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇదే అదనుగా కొన్ని చోట్ల ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేర్లు ఎంపిక చేయటానికి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారని బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో డబ్బులు వసూలు చేస్తున్నారని కలెక్టర్ బీఎం సంతోష్ సమక్షంలోనే కొందరు బాహటంగానే ఆరోపణలు చేయడం తీవ్ర కలకలం రేపింది. ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ.30–50వేల వరకు వసూలు చేస్తున్నారని బాహటంగానే చెబుతున్నారంటే ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ప్రక్రియ ఎంత పారదర్శకంగా జరిగిందో స్పష్టమవుతుంది.
గద్వాల: తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని.. ఇక తమ గూడు కష్టాలు తీరనున్నాయని ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న జిల్లాలోని లబ్ధిదారుల గంపెడాశలపై కొందరు రాజకీయ నాయకులు నీళ్లు చల్లుతున్నారు. అటు ఉన్న ఇంటిని కూల్చేసుకొని.. ఇటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాక అద్దె ఇళ్లలో ఉండే పరిస్థితి దాపురించింది. జిల్లాలోని అలంపూర్, గద్వాల నియోజకవర్గాలకు చెరి 3,500 చొప్పున మొత్తం 7000 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 6,815 లబ్ధిదారులను గుర్తించగా.. ఇందులో 816 ఇండ్లు వివిధ నిర్మాణ దశలో కొనసాగుతున్నాయి.
విచారించి చర్యలు
ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ప్రక్రియలో నిబంధనలు పాటిస్తూ అర్హులైన వారిని ఎంపిక చేయాలని ఽఅధికారులకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. మీరు చెబుతున్నట్లు ఎక్కడైన అనర్హులు ఎంపిక చేసినా.. డబ్బులు వసూలు చేసినట్లు ఎవరైన ఫిర్యాదు చేసినా వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం.
– వి.లక్ష్మీనారాయణ, అదనపు కలెక్టర్
అర్ధాంతరంగా లిస్టులో నుంచి పేర్ల తొలగింపు
మరికొందరు ఇంటి పనులు ప్రారంభించిన అనంతరం లిస్టులో మార్పులు
దిక్కుతోచని స్థితిలో లబ్ధిదారులు
జిల్లాలో నత్తనడకన సాగుతున్న ఇళ్ల నిర్మాణం