
బీసీ బిల్లు చారిత్రాత్మక విజయం
అలంపూర్: రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అసెంబ్లీలో అమోదం పొందడం కాంగ్రెస్ ప్రభుత్వ చారిత్రాత్మక విజయమని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్నారు. అలంపూర్ చౌరస్తాలోని జాతీయరహదారి ఫ్‌లైఓవర్ కూడలిలో అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం సంబరాలు జరుపుకొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌గౌడ్ చిత్రపటానికి పాలతో అభిషేకించి బాణసంచా పేల్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని జనాభా ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, గిరిజన, మైనార్టీలు ఎంత మంది అనే ప్రతిపాదికతన రిజర్వేషన్లు కల్పించడానికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. బీసీలోని బడుగు బలహీన వర్గాలకు ఈ రిజర్వేషన్లు అపూర్వ అవకాశం అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జెడ్పీచైర్మన్‌లు, అలంపూర్, వడ్డేపల్లి, అయిజ మున్సిపాలిటిలో కౌన్సిలర్లకు 42 శాతం బీసీలకు రిజర్వేషన్‌లు లభించే అవకాశం ఉందన్నారు. ఇటీవల ఎస్సీలకు ఏబీసీడీ వర్గీకరణ చేసి 35 ఏళ్ల వారి కలను సీఎం సాకారం చేశారని, గ్రామీణ ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందాలంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు గెలిపించుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాస్, మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్ దొడ్డెప్ప, మాజీ జడ్పీటీసీ సభ్యుడు మద్దిలేటి, నాయకులు షేక్షావలి ఆచారి, గోపాల్, వెంకట్ గౌడ్, రమణ, శ్రీకాంత్, కృష్ణయ్య, జగన్‌మోహన్ నాయుడు తదితరులు ఉన్నారు.