
తగ్గిన ఎండుమిర్చి సాగు
గద్వాల వ్యవసాయం: జిల్లాలో ఎండుమిర్చి సాగు ఈ ఏడాది తగ్గింది. గతేడాదితో పోల్చితే దాదాపు 10 వేలకు పైగా ఎకరాల్లో తగ్గింది. ఎండుమిర్చికి గడిచిన మూడేళ్ల నుంచి ఆశించిన స్థాయిలో ధరలు రావడం లేదు. గోదాంలలో నిల్వ ఉంచుతున్నప్పటికీ సరైన ధరలు పొందలేకపోతున్నారు. దీంతో ఈ ఏడాది చాలామంది రైతులు ఎండుమిర్చికి బదులుగా పత్తి పంట సాగు వైపు మొగ్గు చూపారు.
నల్లరేగడి భూముల్లో..
గడిచిన 15 ఏళ్లుగా ఇక్కడి రైతులు అత్యధికంగా ఎండుమిర్చి సాగుపై దృష్టిసారిస్తున్నారు. బోర్లు, బావులతోపాటు నల్లరేగడి భూముల్లో వర్షాధార పంటగా మిర్చి సాగు చేస్తున్నారు. వాతావరణం అనుకూలించి పంట బాగా చేతికి వస్తే పత్తి కన్నా మిర్చికి మంచి ధరలు లభిస్తాయన్న ఉద్దేశంతో ఈ పంట సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఎకరాకు 15 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఎకరాకు రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు సాగు ఖర్చులు అవుతాయి. కరుణ, సూపర్‌టెన్, జిత్రి, కావేరి, తేజచిల్లి, బ్యాడిగ తదితర రకాలను ఎక్కువగా ఈ ప్రాంతంలో రైతులు సాగు చేస్తున్నారు.
తెగుళ్ల బెడదతో..
గడిచిన 2022–23లో జిల్లాలో 36 వేలు, 2023– 24 లో 65,113 ఎకరాల్లో ఎండుమిర్చి సాగు చేశారు. పంట బాగా వస్తుందనుకునే సమయంలో త్రిప్స్, ఎండుమడత, జెమిని రకాలకు తెగుళ్లు ఆశించాయి. ఈ తెగుళ్ల ప్రభావం పంట దిగుబడులపై పడింది. ఫలితంగా దిగుబడులు గణనీయంగా తగ్గి రైతులు ఆర్థికంగా నష్టపోయారు. ఎకరాకు కనీసం 15 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా కేవలం 8 నుంచి 12 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. ఇదే సమయంలో ధరలు కూడా పడిపోయాయి. ధరలు రాకపోవడంతో నెలల తరబడి శీతల గిడ్డంగుల్లో నిల్వ ఉంచుకున్నారు. ఇక గడిచిన ఏడాది (2024–25)లో 34,073 ఎకరాల్లో పంట సాగు చేయగా.. ఈసారి కూడా రైతులను నష్టాలే వెంటాడాయి. మొదటి మూడు నెలలు బాగా వచ్చిన పంట ఆ తర్వాత తెగుళ్లు, వాతావరణ పరిస్థితులతో దిగుబడులు ఆశించిన స్థాయిలో రాలేదు. కాగా ఎండుమిర్చిలో వైరెటీని బట్టి ధరలు లభిస్తాయి. కొన్ని వైరెటీలకు క్వింటాకు రూ.15 వేల నుంచి రూ.25 వేలు రావాల్సి ఉండగా రూ.8 వేల నుంచి రూ.12వేలు, ఇక మరికొన్ని వైరైటీలకు రూ.45 వేల నుంచి రూ.50 వేలు రావాల్సి ఉండగా రూ.30 వేల నుంచి రూ.40 వేలు మాత్రమే వచ్చాయి. ఇలా వరుసగా మూడేళ్లు ఆర్థికంగా నష్టాలు చవిచూశారు.
మార్కెట్ సౌకర్యం లేక..
ఈ ఏడాది 33,472 ఎకరాల్లో ఎండుమిర్చి సాగు అవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే గడిచిన మూడేళ్ల నుంచి ఎండుమిర్చికి రకరకాల తెగుళ్లు, వైరస్‌లు సోకుతున్నాయి. వీటి వల్ల దిగుబడులు తగ్గుతున్నాయి. మరోవైపు ఏటా ఈ పంటకు పెట్టుబడులు పెరుగుతున్నాయి. వీటన్నింటితోపాటు స్థానికంగా మార్కెట్ సౌకర్యం లేదు. దీంతో దళారులకై నా అమ్మాలి లేదా వ్యయప్రయాసాలకు ఓర్చి కర్నూలు, గుంటూరు, రాయచూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు తీసుకెళ్లాల్సిన పరిస్థితులను ఇక్కడి రైతులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు కాస్త భిన్నంగా ఉన్నాయి. జూన్‌లో సరిగా కురవని వర్షాలు జూలై రెండో వారంలో వచ్చాయి. ఆ తర్వాత ఆగస్టు రెండో, చివరి వారం ఎడతెరపి లేని వర్షాలు కురిసాయి. వీటన్నింటి కారణంగా ఎండుమిర్చి సాగు ఈ ఏడాది తగ్గింది. ఎండుమిర్చికి బదులుగా చాలామంది రైతులు పత్తి పంట వేశారు. ఎండుమిర్చి 33,472 ఎకరాల్లో అంచనా ఉండగా 24,500 ఎకరాల్లో మాత్రమే సాగైంది. గతేడాదితో పోల్చితే దాదాపు 10 వేల ఎకరాల్లో సాగు తక్కువ అయ్యింది.
గతేడాదితో పోల్చితే
10 వేల ఎకరాల్లో తగ్గుదుల
తెగుళ్ల బెడదతో దిగుబడిపై ప్రభావం
ధరలు రాకపోవడమూ కారణమే..
పత్తిపంట వైపు మొగ్గు చూపిన రైతులు

తగ్గిన ఎండుమిర్చి సాగు