
శోభాయమానంగా నిమజ్జనోత్సవం
గద్వాల టౌన్: నమో పార్వతీ తనయా.. ఏకదంతాయా.. విఘ్నరాజాయా... జైజై గణేశా.. జైకొట్టు గణేశా.. అంటూ వాడవాడల పూజలు అందుకున్న బొజ్జ గణపయ్యకు ఇక సెలవంటూ భక్తులు వేడుకల మధ్య వీడ్కోలు పలికారు. ఐదు రోజుల్లో భాగంగా ఆదివారం చేపట్టిన శోభాయాత్ర వైభవంగా సాగింది. పట్టణంలోని పలు వినాయకులను నిమజ్జనం చేశారు. నిమజ్జనోత్సవానికి ముందు ఆయా మండపాల వద్ద గణనాథులకు ప్రత్యేక పూజలు జరిపారు. మహిళలు, యువకులు ఉత్సాహంగా నిమజ్జనోత్సవ ఊరేగింపులో పాల్గొన్నారు. భక్తుల అశేష పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. వివిధ ఆకృతులలో ఏకదంతుడిని తీర్చిదిద్దిన భక్తులు ప్రత్యేక ఆకర్షణతో నిమజ్జనోత్సవానికి తరలివెళ్లారు. యువకులు, చిన్నారులు, పెద్దలు నృత్యాలు, భజనలతో కోలాహలంగా సాగింది.
ప్రభుత్వ వైఖరిని ఖండించాలి
శాంతినగర్: బాధిత ప్రజలను కలిసే హక్కు భారత రాజ్యాంగం కల్పించిందని, బాధిత ప్రజలను కలవడానికి వెళ్తుంటే పోలీసులు అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని తెలంగాణ పీపుల్స్ జాక్ రాష్ట్ర కోకన్వీనర్ కన్నెగంటి రవి, కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి ఆలిండియా కన్వీనర్ బండారి లక్ష్మయ్య అన్నారు. రాజోళి మండలంలోని పెద్దధన్వాడ సమీపంలో నిర్మిస్తున్న ఇథనాల్ కంపెనీ బాధితులను కలవడానికి వారు వెళ్తుండగా శాంతినగర్ పోలీసులు అడ్డుకొని స్టేషన్‌కు తరలించారు. అనంతరం శాంతినగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఇథనాల్ కంపెనీ రద్దు చేయాలని నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులు దౌర్జన్యం చేయడమే కాకుండా అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపడం ఎంతవరకు సమంజసమన్నారు. ఇథనాల్ కంపెనీ వల్ల వాయు, జల, భూగర్భ కాలుష్యం వల్ల క్యాన్సర్ లాంటి ప్రమాదకర రోగాలు వస్తాయన్నారు. పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తున్న ఇథనాల్ కంపెనీని వ్యతిరేకించకుండా యజమానులకు వత్తాసు పలుకుతూ, కంపెనీ నిర్మాణానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య పాలన పేరుతో ప్రజలను మభ్యపెడుతూ ద్వంద్వ నీతిని ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ప్రజాస్వామ్య వాదులు, మేధావులు ఖండించాలన్నారు. హైదరాబాద్ నుంచి మేధావులు వచ్చారని తెలుసుకున్న పెద్దధన్వాడ, మాన్‌దొడ్డి ప్రజలు, రైతులు కలుకుంట్ల వద్ద వెళ్తున్న వారిని కలుసుకుని తమ గోడు వెలిబుచ్చారు. ఆయా గ్రామాల ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని వారితో వివరించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఇంటలెక్చువల్ ఫోరం ఫర్ డెమోక్రసీ (ఐఎఫ్‌డీ) స్వామిదాస్, సామాజిక కార్యకర్త రాజగోపాల్ తదితరులున్నారు.

శోభాయమానంగా నిమజ్జనోత్సవం