
మహబూబ్‌నగర్ పార్లమెంట్‌లోకి నడిగడ్డను తీసుకొస్తా
గద్వాల టౌన్: ప్రస్తుత మహబూబ్‌గనర్ పార్లమెంట్ పరిధిలో నడిగడ్డ ప్రాంతం లేకపోవడంతో తాను అనుకున్న స్థాయిలో గద్వాలను అభివృద్ధి చేయలేకపోతున్నానని ఎంపీ డీకే అరుణ తెలిపారు. గతంలో మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో నడిగడ్డ ప్రాంతం ఉండేదని, నాపై కోపంతో ఓ రాజకీయ పెద్ద మనిషి ఈ ప్రాంతాన్ని నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో కలిపేశారని ఆరోపించారు. ఆదివారం తపస్ ఆధ్వర్యంలో నిర్వహించిన గురువందన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. రాబోయే నియోజకవర్గాల పునర్విభజనలో నడిగడ్డ ప్రాంతాన్ని తిరిగి మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో వచ్చేలా కృషిచేస్తానని హామీ ఇచ్చారు. గతంలో నాయకులు చేసిన తప్పును సరిచేస్తానని వివరించారు. అసమర్థ పాలన వలన ప్రస్తుతం గద్వాల అభివృద్ధి ఆమడదూరంలో ఉందని విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధే తప్ప, ఇప్పుడేమి కనిపించడం లేదని ధ్వజమెత్తారు. నడిగడ్డ అభివృద్ధికి కృషి చేస్తూ పూర్వవైభవం తీసుకొస్తానని చెప్పారు. ఇకపై 15 రోజులకోసారి గద్వాల ప్రజలకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి మాట్లాడుతూ తన గెలుపులో నడిగడ్డ ప్రాంతం కీలకంగా ఉందన్నారు. ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తూ విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దితేనే గుర్తింపు వస్తుందని అభిప్రాయపడ్డారు. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయులు విద్యాబుద్దులు నేర్పాలని సూచించారు. విద్యాభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. అంతకు ముందు జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనభర్చిన ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హన్మంతురావు, జిల్లా అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌రెడ్డి, నాయకులు రవీందర్‌రెడ్డి, అయ్యస్వామి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.