
రూ.లక్షల్లో సంపాదన
సాధారణంగా ఆర్‌ఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాల్సి ఉంటుంది. అయితే ఇదే అదునుగా భావించి గ్రామాల్లో వైద్యుల అవతారం ఎత్తి సామాన్య ప్రజలు అనారోగ్య కారణాలతో అక్కడికి వెళ్తే అన్ని రకాల రక్త పరీక్షలు, మందులు, ఇంజెక్షన్లు ఇవ్వడం, వ్యాధి తగ్గకుంటే అనుబంధ ప్రైవేట్ ఆస్పత్రులకు రెఫర్ చేయడం, వారి నుంచి కమీషన్ తీసుకోవడం వంటివి చేస్తూ రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు. ఈ క్రమంలో వారికి ఏదైనా సమస్య వస్తే కొందరు వైట్ కాలర్ నాయకులు సైతం అండగా నిలుస్తున్నారు. ఆర్‌ఎంపీలకు మందుల సరఫరాలో వివిధ మందుల ఏజెన్సీ నిర్వాహకులతో వ్యాపార ఒప్పందాలు ఉండడం, ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి కూడా మందులు కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇలాంటి దందాలపై నిఘా ఉంచాల్సిన డ్రగ్ కంట్రోల్ అధికారులు సైతం చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. దాడులు చేయకుండా నెలవారి మామూలు కోసం ఎదురుచూస్తారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పుడప్పుడు తమ మాట వినని వారిపై దాడులు చేస్తూ చేతులు దులుపుకొంటున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు.