
పడిగాపులు..!
జిల్లావ్యాప్తంగా యూరియా కోసం రైతుల వెతలు
గట్టు/అయిజ/శాంతినగర్: జిల్లాలో యూరియా కష్టాలు తొలగడం లేదు. పంపిణీ కేంద్రాల వద్ద రాత్రింబవళ్లు రైతులు బారులు తీరుతున్నా.. వారికి దక్కుతాయో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. గురువారం గట్టు సహకార సంఘం దగ్గర యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున గుమిగూడారు. 450 బస్తాల యూరియా రావడంతో వాటి కోసం రైతులు బుధవారం రాత్రి నుంచే క్యూలైన్‌లో పాసుపుస్తకం, ఆధార్ జిరాక్స్ పత్రాలు కల్గిన కవర్లను వరుస క్రమంలో పెట్టారు. యూరియాను అందించే గట్టులోని సహకార సంఘం దగ్గర రైతులు రాత్రి, పగలు అనే తేడా లేకుండా పడిగాపులు పడుతున్నారు. వానాకాలంలో రైతులు సాగు చేసిన పంటలకు యూరియా అవసరం కాగా, ప్రస్తుతం యూరియా బయట మార్కెట్‌లో లభించడం లేదు. కేవలం సహకార సంఘం ద్వారా మాత్రమే పరిమిత సంఖ్యలో రైతుకు 2 బస్తాల మాదిరిగా అందిస్తుండడంతో రైతులు వాటి కోసం పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇలా వచ్చిన రైతును అదుపు చేసేందుకు పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వస్తోంది. గట్టుతో పాటుగా చుట్టు పక్కల గ్రామాల నుంచి యూరియా బస్తాల కోసం రాత్రి, పగలు ఎదురు చూసే పరిస్థితి నెలకొంది. ఓ వైపు వినాయక చవితి పండుగ జరుపుకొంటూనే మరో వైపు రాత్రి పూట సహకార సంఘం దగ్గర యూరియా కోసం క్యూలైన్‌లో జిరాక్స్ పత్రాలు కల్గిన కవర్లను పెడుతున్నారు. వ్యవసాయ అధికారుల సమక్షంలో సహకార సంఘం సిబ్బంది రైతులకు యూరియాను అందిస్తున్నారు.
వర్షంలో తడుస్తూ..
అయిజ సింగిల్‌విండో కార్యాలయం వద్ద యూరియా కోసం గురువారం తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. బుధవారం సెలవురోజు కావడంతో గురువారం తెల్లవారుజామునుంచే సుమారు 600 మంది రైతులు వర్షంలో తడుస్తూ క్యూలో నిల్చున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారండంతో శాంతినగర్ సీఐ టాటాబాబు, ఎస్‌ఐ శ్రీనివాసరావు, పోలీస్ బృందంతో కలిసి రైతులను కట్టడి చేశారు. జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్, మండల వ్యవసాయ అధికారి జనార్ధన్, ఏఈఓలు అక్కడకు చేరుకొని సింగిల్ విండో అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డితో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. అదేవిధంగా డీఏఓ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. రైతులకు ఇచ్చేందుకు యూరియా నిల్వలు లేకపోవడంతో చివరకు రైతులకు టోకెన్లు ఇచ్చి.. టోకెన్లు తీసుకున్న వారికి రైతువేదిక వద్ద పర్మిట్ రషీదులు అందజేశారు. అక్కడ కూడా రైతుల తోపులాటతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు కలుగజేసుకొని గొడవను సద్దుమణిగించారు.
ఉండవెల్లిలోని కలుగోట్ల పీఏసీఎస్ గోదాంలో యూరియా పంపిణీలో గందరగోళం నెలకొంది. ఉన్న ఒక్క మిషన్ చార్జింగ్ అయిపోవడంతో రైతులు గంటలతరబడి పడిగాపులు కాశారు. అక్కడే ఉన్న ఏఓ అనితతో వాగ్వాదానికి దిగారు. దీనికితోడు ఎకరానికి ఒక్క సంచి ఇస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన చెందారు. పత్తి పంట మందు లేక ఎర్రగా మారుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎర్రవల్లి పీఏసీఎస్‌కు 750 బస్తాల యూరియా రాగా.. ఉదయం నుండే కార్యాల యం ముందు రైతులు బారులు తీరారు. పొలం పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులను క్యూలో పెట్టి యూరియా బస్తాల కోసం ఎదురుచూడగా.. అంతలోనే సర్వర్ మొరాయించింది. దీంతో మిగిలిన రైతులకు టోకెన్లు అందించడంతో నిరాశతో వెనుదిరిగారు.
కడుపు కాల్చుకొని.. క్యూలో నిల్చొని
వడ్డేపల్లి మండలంలో యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. పీఏసీఎస్ ఎదుట గురువారం తెల్లవారుజాము నుంచి రైతులు నిల్చుని తెచ్చుకోవాల్సిన పరిస్థితులు దాపురించాయి. ఉదయం వెళ్లిన రైతులు కడుపు కాల్చుకుని సాయంత్రం వరకు క్యూలో నిల్చుంటే ఒక్కో పాస్ పుస్తకానికి రెండు చొప్పున పంపిణీ చేయడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాలను బట్టి యూరియా బస్తాలు ఇవ్వకుండా పాసుపుస్తకం ప్రకారం ఇవ్వడంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. యూరియా అందించకపోతే పంటలు ఏపుగా పెరిగే పరిస్థితి వుండదని, అవసరమైనంత యూరియా సరఫరా చేసి నష్టాల పాలవకుండా చూడాలని ప్రభుత్వాన్ని, అధికారులను రైతులు కోరుతున్నారు.
రాత్రింబవళ్లు పీఏసీఎస్‌ల వద్ద ఎదురుచూపులు
సరిపడా నిల్వలు లేకపోవడంతో టోకెన్ల అందజేత
పలు చోట్ల తోపులాట, ఉద్రిక్తత.. పోలీసుల రంగప్రవేశం

పడిగాపులు..!

పడిగాపులు..!