
నడిగడ్డలో కాంగ్రెస్‌కు భారీ షాక్
గద్వాలటౌన్: నడిగడ్డలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. గద్వాల మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్‌తో పాటు పలువురు మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. నమ్ముకున్న కార్యకర్తల కోసమే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు వారు ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వీరు.. ఏడాది తరువాత తిరిగి సొంత గూటికి చేరడం విశేషం. బీఎస్ కేశవ్ రెండు సార్లు మున్సిపల్ చైర్మన్‌గా పనిచేశారు. గద్వాల పట్టణంలో బలమైన నాయకుడిగా గుర్తింపు సాధించారు. ఆయన పార్టీని వీడడం కాంగ్రెస్‌కు చాలా నష్టం చేకూరనుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
వారికే అందలం..
ఈమేరకు మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్ గురువారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తరువాత విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. గద్వాల కాంగ్రెస్ పార్టీలోని కార్యకర్తలను కాంగ్రెస్ పెద్దలు, మంత్రులు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం ఆర్భాటమే తప్ప.. ఆచరణలో కనిపించడం లేదన్నారు. పార్టీ కార్యకర్తల కంటే పార్టీని విమర్శించే వారికే అందలం వేస్తున్నారని విమర్శించారు. ‘నేను కాంగ్రెస్ పార్టీలో లేను, బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్న.. శ్రీఅని చెప్పుకుంటున్న ప్రజాప్రతినిధికి మంత్రులు దాసోహం కావడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి జూపల్లి కృష్ణరావు గద్వాల పట్టణ అభివృద్ధి, మా రాజకీయ భవిష్యత్‌పై హామీ ఇవ్వడం వల్లే తనతో పాటు 15 మంది కౌన్సిలర్లు, వందల మంది కార్యకర్తలు బీఆర్‌ఎస్‌ను వీడాల్సి వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత గద్వాలలో జరిగిన రాజకీయ పరిణామాలతో మంత్రి జూపల్లి మమ్మల్ని కనీసం పట్టించుకున్న పాపన పోలేదన్నారు. కాంగ్రెస్ పెద్దలు, మంత్రులు బీసీ డిక్లరేషన్, బీసీల రిజర్వేషన్లు గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుందని ఎద్దేవా చేశారు. నడిగడ్డలో బలమైన బీసీ బిడ్డగా సరిత కాంగ్రెస్ నుంచి పోటీచేసి స్వల్ప ఓట్లతో ఓడిపోతే ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ప్రశ్నించారు. నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సంక్షేమ పథకాలు అందడం లేదని, నామినేటేడ్ పదవులు రావడం లేదని చెప్పారు. కపట ప్రేమ ప్రదర్శించే వారికి కాంగ్రెస్ పార్టీ గుర్తింపునిస్తుందన్నారు. బీఆర్‌ఎస్‌తోనే అభివృద్ది సాధ్యమని చెప్పారు.
మున్సిపల్ మాజీ చైర్మన్, పలువురు మాజీ కౌన్సిలర్ల రాజీనామా
వచ్చే నెలలో బీఆర్‌ఎస్‌లోచేరికకు ముహూర్తం
కార్యకర్తల కంటే పార్టీని విమర్శించే వారికే గుర్తింపు : బీఎస్ కేశవ్