
కొలువుదీరిన బొజ్జ గణపయ్య
గద్వాలటౌన్/గద్వాల క్రైం: జిల్లాలో వినాయక చవితి పండగను బుధవారం ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు వెయ్యి విగ్రహాలకు పైగా ప్రతిమలను ప్రతిష్ఠించారు. పాటలు, భజనలతో మండపాలు హోరెత్తాయి. కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మండపంలోని మట్టి వినాయకుడిని కలెక్టర్ బీఎం సంతోష్ దర్శించుకొని శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. సకల విష్నూలు తొలగించే గణనాథుడి ఆశీస్సులు ఎల్లప్పుడు ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ శ్రీనివాసరావు దంపతులు, కార్యాలయ సిబ్బంది గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లాలోని ప్రజలందరు సుఖ సంతోషలతో జీవించాలని, చట్టాలపై ప్రతి ఒక్కరు అవగహన కలిగి ఉండాలన్నారు. బీఎస్‌కే యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతికి మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి సరిత పట్టణంలోని పలు మండపాలలోని వినాయకులను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఇదిలాఉండగా, వినూత్న ఆకారాల్లో కొలువుదీరిన గణనాథులు ఆకట్టుకున్నాయి.

కొలువుదీరిన బొజ్జ గణపయ్య