
ప్రతి రైతుకూ యూరియా అందేలా చూస్తాం
యూరియా కొరత గట్టులో ఒక్కటే లేదని, రాష్ట్రం, దేశం మొత్తం మీద యూరియా కొరత ఉందని, రైతులకు కావాల్సిన యూరియాను అందించే విధంగా చర్యలు తీసుకుంటామని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తెలిపారు. గురువారం గట్టుకు వచ్చిన ఎమ్మెల్యే,సహకార సంఘం దగ్గర యూరియా కోసం పెద్ద ఎత్తున గుమిగూడిన రైతులను చూసి, వారి దగ్గరకు వెళ్లి పలకరించారు. యూరియా సరఫరాపై ఆరా తీశారు. రైతులు యూరియా కోసం అధైర్య పడాల్సిన అవసరం లేదని ఇప్పటికే ఇక్కడ 400 బస్తాల యూరియా అందుబాటులో ఉందని, మరో 450 బస్తాల యూరియా లోడు వస్తుందని తెలిపారు. ఆయా దేశాల యుద్దం కారణంగా దేశంలో యూరియా కొరత ఏర్పడిందని, రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని తెలిపారు. గట్టుకు యూరియా కేటాయింపులపై ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే నేరుగా ఫోన్‌లో మాట్లాడారు. ప్రతి రైతులకు యూరియా బస్తాలు అందించే విధంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు.