
మట్టి వినాయకులను ప్రతిష్టించండి
మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించి నవరాత్రి ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. జిల్లా బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సౌజన్యంతో మట్టి వినాయకులను సమకూర్చారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పాల్గొని కలెక్టరేట్‌లోని వివిధ శాఖల అధికారులతోపాటు పట్టణంలోని పలువురికి ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని సూచించారు. కాలుష్యానికి కారకంగా నిలుస్తున్న ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను ప్రతిష్టించకుండా చూడాలన్నారు. ప్రతి ఏడాది మట్టి వినాయక విగ్రహాలు తయారు చేయడానికి అవసరమైన సహాయ సహకారాలను ప్రభుత్వపరంగా అందిస్తామన్నారు. తద్వారా కులవృత్తులను ప్రోత్సహిస్తామని చెప్పారు. భక్తిశ్రద్ధలతో వినాయక ఉత్సవాలను విజయవంతంగా ముగించాలని సూచించారు. అలాగే విగ్రహాల నిమజ్జన సమయంలో స్వచ్ఛత, క్రమశిక్షణ పాటించాలని, అధికార యంత్రాగం ఏర్పాటు చేసిన బీచుపల్లి, నదిఆగ్రహారం, జమ్మిచేడు, జూరాల డ్యాం ప్రాంతాలలో గణపతి విగ్రహాలను నిమజ్జనం చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నుశిత, ఏఓ భూపాల్‌రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారి అక్బర్‌పాషా, సివిల్ సప్‌లైయ్ జిల్లా మేనేజర్ విమల తదితరులు పాల్గొన్నారు.