
మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి
గద్వాల: విరివిరిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కలెక్టర్ బీఎం సంతోష్, ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాతావరణ కాలుష్యం వల్ల ఇప్పటికే చాలా పట్టణాల్లో స్వచ్ఛమైన ఆక్సిజన్ లభించడం గగనమైందని, ఇది ఇలాగే కొనసాగితే రాబోయే తరాలు ఆక్సిజన్‌ను కొనుక్కునే పరిస్థితి తలెత్తుతాయని, ఈ దుస్థితిని అధిగమించాలంటే విరివిరిగా మొక్కలు నాటాలన్నారు. జిల్లాలో అటవీ విస్తీర్ణం తక్కువగా ఉందని ప్రతిఒక్కరు మొక్కలు నాటి ఈ శాతాన్ని పెంచేలా కృషి చేయాలన్నారు. ఇందుకోసం ప్రతిఒక్కరు కనీసం పదిమొక్కలు నాటాలన్నారు. జిల్లాకు మొత్తం 15 లక్షల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటి వరకు 88 శాతం పూర్తయిందని ఈ రెండు నెలల్లో సమృద్ధిగా వర్షాలు ఉండే ఈ సమయంలో అన్ని శాఖలు తమ లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. అటవీశాఖ జిల్లా అధికారి కేవీవీఎస్ ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ వనమహోత్సవంలో పెట్టుకున్న లక్ష్యం సాధించినట్లు తెలిపారు. ప్రజలు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, మార్కెట్ యార్డు చైర్మన్ హనుమంతు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పర్వేజ్ అహ్మాద్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ మహబూబ్‌ఖాన్, ప్రభుత్వ సూపరింటెండెంట్ ఇందిర, కళాశాల సూపరింటెండెంట్ నాగేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.