
శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
దోమలపెంట: ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా నీటి ప్రవాహం కొనసాగుతుంది. జూరాల ప్రాజెక్టు 37 క్రస్టు గేట్లు ఎత్తి స్పీల్‌వే ద్వారా 3,53,573, సుంకేసుల నుంచి 17,874, హంద్రీ నుంచి 250 మొత్తం 3,71,697 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. దీంతో ఆదివారం రాత్రికి ఐదు గేట్లు ఒక్కొక్కటి 16 అడుగుల మేర పైకెత్తి స్పీల్‌వే ద్వారా 3,80,380 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. మరోవైపు ఎడమగట్టు భూగర్భకేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315, ఏపీ జెన్‌కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 26,396 మొత్తం 61,711 క్యూసెక్కుల నీటిని అదనంగా సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 881.4 అడుగుల వద్ద 195.6605 టీఎంసీల నీటి నిల్వ ఉంది.