ధరూరు: జిల్లాలో ప్రతిఒక్కరూ జీవీకే ఈఎంఆర్‌ఐ 108, 102 అంబులెన్స్ సేవలను సద్విరనియోగం చేసుకోవాలని ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ రవి అన్నారు. మంగళవారం ఆయన మండలంలోని ఉప్పేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి 108, 102 వైద్య సిబ్బందితో మాట్లాడారు. గర్భిణులను పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకువెళ్లడంలో ఎలాంటి అలసత్వం చేయరాదన్నారు. అలాగే అత్యవసర సేవలకు అంబులెన్సు సేవలను వినియోగించుకోవాలని, ఆ సమయంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శిచవద్దని సిబ్బందికి సూచించారు. పీహెచ్‌సీ పరిసర గ్రామాల ప్రజలు ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఉన్నా ఈ సేవలను వినియోగించుకోవచ్చని చెప్పారు. అప్పుడే పుట్టిన బిడ్డలకు ఎలాంటి వైద్యం కోసమైనా.. ఎక్కడికై నా ఉచితంగా తీసుకువెళ్లేందుకు అంబులెన్స్ అందుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ రత్నమయ్య, సిబ్బంది రఫి, వెంకటేష్, 102 కెప్టెన్ రఘు తదితరులు పాల్గొన్నారు.
385 క్వింటాళ్ల వేరుశనగ
గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు మంగళవారం 385 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. క్వింటాల్ గరిష్టంగా రూ.6,416, కనిష్టంగా రూ.3,029, సరాసరిగా రూ.4,319 ధరలు లభించాయి.
ఆర్‌ఎంపీ క్లినిక్ సీజ్
గద్వాల క్రైం: జిల్లా కేంద్రంలో ఎలాంటి అర్హత లేకుండా క్లినిక్ ఏర్పాటు చేసి పరిమితికి మించి వైద్య సేవలు అందిస్తున్న ప్రథమ చికిత్స కేంద్రాన్ని మంగళవారం జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు సీజ్ చేశారు. మాతా శిశు సంరక్షణ ప్రోగ్రాం అధికారి ప్రసూనరాణి కథనం మేరకు.. గద్వాల పట్టణంలోని సుంకులమ్మమెట్ సమీపంలో అరవింద్ ప్రథమ చికిత్స కేంద్రాన్ని రామన్‌గౌడ్ కొంత కాలంగా నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో క్లినిక్‌లో తనిఖీలు చేయగా యాంటీ బయోటిక్స్, పెయిన్ కిల్లర్, స్టిరాయిడ్స్, సిరప్స్, ఐవీ ప్లూయిడ్లు, బాటిళ్లు ఎక్కించడం, నెబ్యులైజేషన్ మిషన్, కుట్లు వేసే సామగ్రిని గుర్తించినట్లు తెలిపారు. డాక్టర్ పేరుతో కలిగిన సర్టిఫికెట్, ప్రైవేటు ఆస్పత్రులకు స్కానింగ్ రెఫర్ చేసే స్లిప్‌లు ఉన్నాయన్నారు. అనంతరం క్లినిక్ సీజ్ చేసి మందులు, పరికరాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిర్వాహకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్‌ఎంపీలు పరిమితికి లోబడే వైద్య సేవలు అందించాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వైద్య సేవలు అందిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రసూనరాణి హెచ్చరించారు. తనిఖీలో మధుసూదన్‌రెడ్డి, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
జెన్‌కోలో ముగిసిన రాష్ట్రస్థాయి క్రీడలు
ఆత్మకూర్: ఎగువ జూరాల జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న తెలంగాణ జెన్‌కో రాష్ట్రస్థాయి క్యారం, చెస్ పోటీలు మంగళవారం ముగిశాయి. క్యారమ్స్‌లో మొదటి బహుమతిని యాదాద్రి జట్టు కై వసం చేసుకోగా, చెస్‌లో కాకతీయ థర్మల్ కేంద్రం జట్టు కై వసం చేసుకుంది. విజేతలకు జెన్‌కో ఎస్‌ఈలు శ్రీధర్, సురేష్ బహుమతులు ప్రదానం చేశారు. పోటీల్లో కొత్తగూడెం తర్మల్ కేంద్రం, శ్రీశైలం, జూరాల, భద్రాద్రి, విద్యుత్‌సౌథ, యాదాద్రి, పులిచింతల, కాకతీయ ప్రాజెక్టులకు చెందిన 60 మంది ఉద్యోగులు పాల్గొన్నారు.