
నిరీక్షణకు తెర
చేపపిల్లల పంపిణీకి మోక్షం
అన్ని చెరువుల్లో వదిలితేనే ప్రయోజనం
●
త్వరలో చేపపిల్లలు వదులుతాం
2025–26 సంవత్సరానికి చేపల సీడ్ వదిలేందుకు అవసరమైన టెండర్ ప్రక్రియ ఆరంభం అయ్యింది. సెప్టెంబర్ 1నాటికి టెండర్ ఓపెన్ చేస్తారు. జిల్లాలో సెప్టెంబర్ మొదటి వారం లేదా రెండో వారంలో చేపల సీడ్ వదిలేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. దాదాపు 60 శాతం నీరు నిండిన జలాశయాల్లో చేపలు వదిలేందుకు నిర్ణయించాం. – షకీలాభానో,
జిల్లా మత్స్యశాఖ అధికారి
గద్వాల వ్యవసాయం: ఎట్టకేలకు ఉచిత చేప పిల్లల పంపిణీలో సందిగ్ధం తొలగింది. కొద్ది రోజులుగా ఎదురుచూస్తున్న మత్స్యకారుల నిరీక్షణకు తెరపడింది. ఈ ఏడాది (2025–26)లో చేపపిల్లల (సీడ్) పంపిణీ నిమిత్తం అవసరమైన టెండర్ ప్రక్రియ కొద్ది రోజుల క్రితం ఆరంభమైంది. మొత్తంగా ఈ ఏడాది చేపపిల్లల పంపిణీ ఉంటుందా.. ఉండదా అన్న అనుమానాలకు తెరపడింది. ఈనెలాఖరు నాటికి టెండర్ ప్రక్రియ ముగిసి, సెప్టెంబర్ మొదటి లేదా రెండో వారంలో జలాశయాల్లో చేపల సీడ్‌ను వదిలేలా మత్స్యశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో 1.60కోట్ల నుంచి 2కోట్ల వరకు జలాశయాల్లో సీడ్‌ను వదిలే అవకాశం ఉంది.
జిల్లాలో నీటి వనరులు
జిల్లాలో 93 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉండగా.. ఇందులో 7,162 మంది మత్స్యకారులు ఉన్నారు. వీరుగాక మరో 3వేల మంది దాకా చేపల విక్రయంపై ఆధారపడుతుంటారు. ఈ కుటుంబాలకు చేపలు, రొయ్యల పెంపకం, విక్రయించడమే జీవనాధారం. జిల్లాలో కృష్ణా, తుంగభద్ర నదులు, జూరాల ప్రాజెక్ట్, శ్రీశైలం బ్యాక్ వాటర్, ఆరు రిజర్వాయర్లు, 35 నోటిఫైడ్ చెరువులతో పాటు 396 చిన్న చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటిలో ఏటా మత్స్యశాఖ అందించే చేపల, రొయ్యల సీడ్‌ను వదిలి పెంచుతున్నారు. ఇదిలాఉండగాచ గత ప్రభుత్వం 2018–19లో తీసుకొచ్చిన సమీకృత మత్స్య అభివృద్ధి పథకంతో మత్స్యకారులకు రూ.2 కోట్లు విలువ చేసే ద్విచక్ర వాహనాలు, ఆటోలు, నాలుగు చక్రాల వాహనాలు, ట్రేలు, ఐస్‌బాక్స్‌లు, వలలు, ఎలక్ట్రానిక్ కాంఠాలు తదితరమైనవి సమకూరాయి. వీటివల్ల మత్స్యకారులకు ఎంతో ప్రయోజనం చేకూరిందని చెప్పవచ్చు.
ఇటీవల టెండర్ ప్రక్రియ
సాధారణంగా జూలై నెలలో టెండర్లు ఆహ్వనించి ఆగస్టు నెలలో చేప సీడ్‌ను వదులుతారు. అయితే ఈఏడాది ప్రభుత్వం సకాలంలో బడ్జెట్ కేటాయింపు జరపకపోవడం వల్ల ఆలస్యం అయ్యింది. ఈనెల 18న టెండర్ నోటిఫికేషన్ జారీ జరిగింది. 35ఎంఎం నుంచి 40ఎంఎం సీడ్‌కు రూ.62పైసలు, 80ఎంఎం నుంచి 100ఎంఎం సీడ్‌కు రూ.1.65పైసలు రేటుగా నిర్ణయంచి టెండర్లు ఆహ్వానించారు. సెప్టెంబర్ 1న టెండర్లు ఓపన్ చేసి కాంట్రాక్టర్‌ను ఖరారు చేయనున్నారు. ఆ తర్వాత సెప్టెంబర్ మొదటి లేదా రెండో వారంలో సీడ్‌ను వదిలేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
జిల్లా వివరాలిలా..
ఏడాది వదిలిన చేపల
సీడ్ సంఖ్య
(కోట్లలో)
2017–18 1.01
2018–19 0.59
2019–20 1.02
2020–21 1.15
2021–22 1.50
2022–23 1.69
2023–24 1.78
2024–25 1.30
టెండర్ ప్రక్రియ ప్రారంభం
సెప్టెంబర్‌లో 1.60 కోట్ల నుంచి
2 కోట్ల చేపపిల్లలు వదిలే అవకాశం
చేప పిల్లలను వదలాలంటే జలాశాయాల్లో 60 శాతం నీళ్లు ఉండాలి. అయితే ఎగువన కురిసిన వర్షాల జూరాల జలాశయానికి భారీగా వరద నీరు చేరింది. దీంతో నెట్టెంపాడు ఎత్తిపోథల ద్వారా రిజర్వాయర్లకు, పలు పెద్ద చెరువులకు నీటిని విడుదల చేశారు. దీంతో పాటు జూలై చివరివారం, ఆగస్టు నెలలో కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. అవకాశం ఉన్న ప్రతి జలాశయంలోను చేపపిల్లలను వదలాలని మత్స్యకారులు కోరుతున్నారు. ఎందుకంటే 2023–24 సంవత్సరంలో 1.78 కోట్ల చేపల సీడ్‌ను వదలగా.. 2024–25లో 1.30కోట్ల సీడ్‌ను మాత్రమే వదిలారు. ఆ ఏడాది ఒక్క గద్వాల మండలంలోనే సంగాల, జములమ్మ చెరువులతో పాటు, పర్మాల, జిల్లెబండ లాంటి దాదాపు 20కి పైగా చిన్న చెరువుల్లో చేపల సీడ్‌ను వదల్లేదు. దీనివల్ల తాము ఆర్థికంగా చాలా నష్టపోయామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఈ ఏడాదైన ఆయా జలశయాల్లో నీటి లభ్యత ఆధారంగా డిమాండ్ మేరకు సీడ్ వదలాలని, మత్స్యకారులకు మెరుగైన ఉపాధి కల్పించాలని కోరుతున్నారు.

నిరీక్షణకు తెర