
నియమాలు పాటిస్తే నిర్విఘ్నం
● వినాయక మండపాల ఏర్పాటు
వేడుకల్లో అప్రమత్తత అవసరం
● పోలీసులు, అధికారుల సూచనలు
శిరోధార్యం
గద్వాలటౌన్: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వినాయక చవితా రానే వచ్చింది. కుల, మతాలకతీతంగా వాడవాడలా విఘ్న నాయకులను భక్తి శ్రద్ధలతో నెలకొల్పే సమయం అసన్నమైంది. గణేష్ నవరాత్రి వేడుకలు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే భక్తులు ఉత్సవాల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. విగ్రహ మండపాల ఏర్పాటు, పూజలు, ఊరేగింపు, నిమజ్జనం ఇలా ప్రతి సందర్భంలో చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే నవరాత్రులు విజయవంతమేనట్లే.. విఘ్నేశ్వరుడి కృపాకటాక్షాలు లభించినట్లే. ఈ నేపథ్యంలో నిర్వహకులు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి.
సామాన్యులకు ఆటకం కలిగించొద్దు
వినాయకుడి మండపాలను నిర్మించే సమయంలో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలి. రహదారి మధ్యలో మండపాలు నిర్మిస్తే వాహనాల రాకపోకలు, ఇతరత్రా ఇబ్బందులు ఎదురవుతాయి. రోడ్డు పక్కన, ఖాళీ స్థలంలో నిర్మించాలి. అలాగే, శోభాయాత్రలో యువత మద్యం మత్తులో జోగుతూ నృత్యాలు చేస్తుంటారు. నిమజ్జనం రోజు సైతం మద్యం తాగకుండా భక్తితో వేడుకల్లో పాల్గొనాలి. శోభయాత్రలో విద్యుత్తు తీగలను పరిశీలిస్తూ అప్రమత్తంగా వాహనం ముందుకు సాగాలి.
అనధికార కనెక్షన్లతో ముప్పు
మండపాలకు విద్యుత్ కనెక్షన్లు అనధికారికంగా తీసుకోవద్దు. అధికారిక కనెక్షన్లు అయితే విద్యుత్తు సిబ్బంది వచ్చి పరిశీలించి వైరింగ్ సక్రమంగా ఉండేలా చేస్తారు. విద్యుత్ తీగల కింద ఏర్పాటు చేయొద్దు. అలాంటి పరిస్థితి ఉంటే విగ్రహాలను వాహనాల నుంచి దించేటప్పుడు, మండపంలో ప్రతిష్టించేటప్పుడు చుట్టుపక్కల పైబాగాల్లో పరిశీలించాలి. అలాగే, మండపాల వద్ద టపాసులు, ఇతర మందుగుండు సామగ్రి ఉంచొద్దు. 24 గంటలు సభ్యులు ఉండాలి. ఒక డ్రమ్‌లో నీరు, రెండు బకెట్లలో ఇసుక నింపి ఉంచుకోవాలి. శాంతి కమిటీ సమావేశంలో పోలీసులు, అధికారులు సూచించే అంశాలను పాటించాలి. నిమజ్జనం రోజు చెరువుల్లో గుంతలు ఉంటాయి. నది, కాలువల్లో నీటి ప్రవాహం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి.
అధిక శబ్దాలు వద్దు
పూజలు నిర్వహించే వేళల్లో వేదమంత్రాలు స్థానికులందరకీ వినిపించేలా వైకులు, డీజే బాక్సులు, భారీ స్పీకర్లు ఏర్పాటు చేస్తుంటారు. డీజేలకు అనుమతి లేదు. స్పీకర్లు, మైకు ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పని సరి. రోజంతా భక్తి గీతాలు మోగించడంతో చిన్నారులు, వృద్దులు, విద్యార్థులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. పూజ జరిగే వేళల్లోనే తక్కువ శబ్దంతో మైకులు వాడటం ఉత్తమం. అలాగే, మండపాలను నాణ్యమైన వస్తువులతో నిర్మించుకోవాలి. సత్ప్రవర్తన కలిగిన సభ్యులను నియమించుకుని భక్తులను క్రమబద్ధీకరించేలా చూసుకోవాలి. అదేవిధంగా సామూహిక వేడుకలు, మండపాల వద్ద భక్తులు గణనాథుని దర్శనానికి బారులుతీరుతారు. రద్దీ ప్రాంతాలలో చోరీలు జరిగే అవకాశాలు లేకపోలేదు. అప్రమత్తంగా ఉండాలి. మండపాల అలంకరణ, నిమజ్జనం రోజు అధికంగా ఖర్చు చేయడం కంటే అన్నదానాలు, పిల్లలకు విజ్ఞాన, వినోద కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వడం సముచితం.
గద్వాలలో ప్రతిష్టాపన కోసం
భారీ గణనాథుడిని ఊరేగింపుతో తీసుకొస్తున్న భక్తులు