
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఎర్రవల్లి: పులి సంచరించింది అనే వార్తల నేపథ్యంలో ఇటిక్యాల మండలంలోని ఉదండాపురం, షాబాద్, చాగాపురం, పెద్దదిన్నె, బట్లదిన్నె శివార్లలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ సెక్షన్ అధికారి మన్యమయ్య అన్నారు. మండల శివారులో పులి సంచరిస్తున్నట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు సోమవారం వైరల్ కావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ సెక్షన్ అధికారి పలు ప్రాంతాల్లో పర్యటించారు. గుర్తు తెలియని జంతువు సంచరించిన ఆనవాళ్లని గుర్తించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సంచరించిన జంతువు పులి అనడానికి పూర్తి స్థాయిలో నమ్మదగిన ఆనవాళ్లు కనబడలేదని, అటుగా చూసిన వాళ్లు మాత్రమే జింకలతో పాటు పులి, రెండు పులి పిల్లలు ఉన్నాయి అని చెప్పారన్నారు. పై గ్రామాల్లో పంట పొలాల్లో పనికి వెళ్లే రైతులు, కూలీలు, గొర్రెలు, బర్రెల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎక్కడైన పులి కనబడితే వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించాలని ఆయన సూచించారు.
అంబులెన్స్ సేవలు
సద్వినియోగం చేసుకోవాలి
రాజోళి/శాంతినగర్: అంబులెన్స్ సేవలను ప్రతి గ్రామ ప్రజలు సద్వినియోగంచేసుకోవాలని జిల్లా అధికారి రత్నమయ్య అన్నారు. సోమవారం రాజోళి, వడ్డేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 108 అంబులెన్స్‌లను ఆయన తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. అంబులెన్స్ ద్వారా ఏ పరిస్థితుల్లో ఎలాంటి వారిని ఆసుపత్రులకు చేర్చిన వివరాలను ఆరా తీశారు. అంతేగాక 108, 102 వాహనాల్లోని ఆక్సిజన్ సిలిండర్‌లు, మెడికల్ ఎక్విప్‌మెంట్‌లు, మెడిసిన్స్ చెక్ చేశారు. అత్యవసర సమయంలో 108, 102 సేవలు ప్రజలు ఉపయోగించుకోవాలని, వాటి ప్రాముఖ్యతను తెలుసుకోవాలన్నారు. వైద్య సిబ్బంది కూడా ప్రజలకు అంబులెన్స్‌ల సేవలను గురుంచి తెలియచేయాలన్నారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మధుబాబు,వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి