
బస్సులు ఆపడంలేదని రోడ్డెక్కిన విద్యార్థులు
గద్వాల:గద్వాల మండలం గోనుపాడు వద్ద ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ వద్ద ఆర్టీసీ బస్సులు ఆపాలని ఏబీవీపీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శనివారం రాస్తారోకో చేశారు. ఈసందర్భంగా విద్యార్థి సంఘం నాయకుడు రఘువంశీ మాట్లాడుతూ గద్వాల జిల్లాలో ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కాలేజీలో రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు ఇక్కడికొచ్చి చదువుతున్నారని, కాలేజీ వద్ద ఆర్టీసీ బస్సులు ఆపడం లేదని దీనివల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఇక్కడకి రావాలంటే ఇబ్బందులు పడతారని దీనివల్ల అడ్మిషన్లు పూర్తిగా నిలిచిపోతే కాలేజీ మూతపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పలుమార్లు అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పాలిటెక్నిక్ కాలేజీ వద్ద ఆర్టీసీ బస్సు ఆపేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీంతో గద్వాల–రాయచూరు ప్రధానరహదారిపై వాహనాలు నిలిచిపోయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు విద్యార్థిసంఘం నాయకులు అదుపులోకి తీసుకుని రహదారిపై నిలిచిపోయిన వాహనాలకు క్లియరెన్స్ చేశారు. ఈకార్యక్రమంలో నరేష్, తేజ, సాయిహర్ష, నితిన్, గణేష్, రమేష్, అంజి, సునీల్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.