
కేసులు ఎత్తివేసే దాక పండుగలు చేసుకోం
పెద్ద ధన్వాడ రైతుల తీర్మానం
అలంపూర్/శాంతినగర్: ‘ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయడమే మాకు పెద్ద పండుగ.. రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేసే వరకు ఏ పండుగనూ జరుపుకోం’ అని రాజోళి మండలం పెద్ద ధన్వాడ గ్రామ రైతులు తీర్మానించారు. ఈ నెల 11న రైతుల పండుగ ఏరువాక పౌర్ణమి నేపథ్యంలో మంగళవారం గ్రామస్తులు రైతువేదిక వద్ద సమావేశమయ్యారు. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును నిరసిస్తూ ఇటీవల ఆందోళన కార్యక్రమం చేపట్టగా.. అనుకోకుండా జరిగిన ఘర్షణలో 12 మంది రైతులను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించిన విషయం విదితమే. అయితే తోటి రైతులు జైలులో ఉంటే తాము ఎలా పండుగ చేసుకుంటామని రైతులు వాపోతున్నారు. తోటి రైతులు లేకుండా.. ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు కాకుండా పండుగ నిర్వహించుకునే ప్రసక్తే లేదని ముక్త కంఠంతో తీర్మానించారు. రైతులు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి గ్రామంలోని కూలీలు, ఇతరులు కూడా ఏరువాక పండుగను జరుపుకోవద్దని నిర్ణయించుకున్నారు. కాగా, పెద్ద ధన్వాడ గ్రామస్తులు సమావేశమై పండుగ జరుపుకోరాదని తీర్మానం చేసిన విషయం తెలుసుకున్న చిన్న ధన్వాడ రైతులు సైతం వారికి సంఘీబావంగా తమ గ్రామంలో కూడా ఏరువాక పౌర్ణమిని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. రైతులు తీసుకున్న నిర్ణయానికి సమీప గ్రామాల రైతులు సైతం మద్దతు ప్రకటిస్తున్నారు.
అక్రమ కేసులు ఎత్తివేయాలి..
ఇథనాల్ కంపెనీ కాలుష్యంతో పంటలు పండవని, మనుషులు రోగాల బారిన పడతారని శాంతియుతంగా నిరసన తెలిపితే పట్టించుకోలేదు. ఇథనాల్ కంపెనీని రద్దు చేసేందుకు కృషిచేస్తామని నాయకులు చెబితే నిరసనలు విరమించుకున్నాం. అకస్మాత్తుగా ఫ్యాక్టరీ పనులు ప్రారంభించేందుకు ప్రైవేటు సైన్యంతో వచ్చారు. 12 గ్రామాల ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లే కంపెనీని రద్దు చేయాలని ఆందోళన చేపడితే రైతులపై అక్రమ కేసులు పెట్టడం ఏంటి. న్యాయం కావాలని ఆందోళన చేపడితే అన్నదాతలను అరెస్ట్ చేయడమేంటి. రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలి.
– శ్యాంప్రసాద్, పెద్ద ధన్వాడ
పండుగలు జరుపుకోం.
ఇథనాల్ కంపెనీ ఏర్పాటుచేస్తే మా గ్రామానికి, రైతులకు నష్టం వాటిల్లుతుందని ఆందోళన చేపట్టిన రైతులు జైలులో ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు బాధపడుతుంటే తోటి రైతులం మేము ఎలా పండుగ జరుపుకుంటాం. జైలులో ఉన్న రైతులు గ్రామానికి వచ్చే దాక ఏ పండుగనూ జరుపుకోము. ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలి. అప్పుడే మాకు పెద్ద పండుగ. అందుకే రైతుల పండుగ ఏరువాక పౌర్ణమిని జరుపుకోకూడదని నిర్ణయించుకున్నాం.
– వీరన్న, రైతు, పెద్ద ధన్వాడ
●

కేసులు ఎత్తివేసే దాక పండుగలు చేసుకోం

కేసులు ఎత్తివేసే దాక పండుగలు చేసుకోం