
రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది
ఎర్రవల్లి: రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ద్వారానే ప్రశ్నించడంతో పాటు మన హక్కులను సాధించగలుగుతున్నామని.. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్నారు. బుధవారం ఎర్రవల్లి మండలంలోని బీచుపల్లిలో ఏర్పాటు చేసిన జైబాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమానికి రాష్ట్ర సాంస్కృతికశాఖ చైర్మన్ వెన్నెల, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మెన్ దీపక్‌జాన్‌తో కలిసి ఆయన హాజరై మాట్లాడారు. గాంధీజీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కలలుగన్న గ్రామ స్వరాజ్యం, రాజ్యాంగ పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని అన్నారు. మహాత్మా గాంధీ చూపిన మార్గంలో నడుస్తూ.. రాజ్యాంగాన్ని కాపాడుతూ.. దేశ ప్రజలను మభ్యపెడుతూ మనువాద సిద్దాంతాన్ని ప్రజలపైన రుద్దుతున్న బీజేపీ పార్టీని ఎండగడుతూ రాజ్యాంగ పరిరక్షణపై అవగాహన కల్పించే దిశగా గ్రామ గ్రామాన పాదయాత్రలు చేస్తూ నాయకులు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. బీజేపీ ప్రభుత్వం హిందీని జాతీయ భాష చేయాలని కుట్ర పన్నుతుందని, తెలుగు ప్రాంత ప్రజలకు అన్యాయం చేసే ఈ చర్యను అడుగడుగునా అడ్డుకోవాలని అన్నారు. జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ సరిత మాట్లాడుతూ.. పార్టీ కోసం నిరంతరం కష్టపడి పనిచేసిన వాళ్లకి చివరికి అన్యాయం జరిగిందని, తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం పాటుపడితే సొంత పార్టీ వాల్లే తమ కష్టాన్ని గుర్తించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా, గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల నాయకులు పలు సమస్యలపై ఒకరికొకరు ప్రశ్నించుకొని మాటలతో వాగ్వాదాలకు దిగగా.. ఏఐసిసి కార్యదర్శి ఇరువురికి సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం నాయకులు, కార్యకర్తలతో కలిసి రాష్ట్ర సాంస్కృతికశాఖ చైర్మన్ వెన్నెల ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీను, మార్కెట్‌యార్డు చైర్మెన్ దొడ్డెప్ప, వైస్ చైర్మెన్ కుమార్, ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీచుపల్లిలో ప్రత్యేక పూజలు
మండలంలోని బీచుపల్లి పుణ్యక్షేత్రాన్ని బుధవారం ఏఐసిసి కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, రాష్ట్ర సాంస్కృతికశాఖ చైర్‌పర్సన్ వెన్నెల, క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మెన్ దీపక్‌జాన్ సందర్శించారు. అభయాంజనేయస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు శేషవస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.