శాంతిభద్రతల పరిరక్షణలో నిర్లక్ష్యం వద్దు | - | Sakshi
Sakshi News home page

శాంతిభద్రతల పరిరక్షణలో నిర్లక్ష్యం వద్దు

Mar 26 2025 1:35 AM | Updated on Mar 26 2025 1:29 AM

గద్వాల క్రైం: శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో పోలీసు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహించవద్దని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ.. అనుమానాస్పద కేసుల విచారణలో వేగం పెంచాలని సూచించారు. వివిధ సమస్యలపై పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు భరోసా కల్పించేలా వ్యవహరించాలని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ, ప్రైవేటు భూములను కబ్జాకు పాల్పడినట్లు వచ్చే ఫిర్యాదులపై శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. జిల్లాలో చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఇసుక, మట్టి, రేషన్‌ బియ్యం, నిషేధిత మత్తు పదార్థాలు, గంజాయి అక్రమ రవాణా, పేకాట వంటి వాటిని కట్టడి చేయాలన్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ట నిఘా ఉంచాలని తెలిపారు. పోలీసు సిబ్బందిపై వస్తున్న ఫిర్యాదులపై చర్యలు తప్పవన్నారు. స్టేషన్‌ పరిధిలో సిబ్బంది ఎవరైనా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. నమోదైన కేసుల విషయంలో నిర్లక్ష్యం లేకుండా వీలైనంత త్వరగా కోర్టులో చార్జీషిట్‌ దాఖలు చేసి.. న్యాయస్థానంలో నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు. అనంతరం ఆయా స్టేషన్‌ల్లో నమోదైన కేసుల విచారణ వివరాలను ఎస్పీ తెలుసుకున్నారు. సమావేశంలో డీఎస్పీ మొగులయ్య, సీఐలు టాటాబాబు, శ్రీను, రవిబాబు, ఎస్‌ఐలు, కళ్యాణ్‌కుమార్‌, శ్రీకాంత్‌, వెంకటేశ్‌, శ్రీనివాసులు, నాగశేఖర్‌రెడ్డి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement