
రిటర్నింగ్ అధికారి చంద్రకళ నుంచి ధ్రువీకరణ పత్రం అందుకుంటున్న విజయుడు
అలంపూర్: రాష్ట్రవ్యాప్తంగా హస్తం హవా కొనసాగినా.. అలంపూర్‌లో మాత్రం కారు జోరుకు అడ్డుకట్ట వేయలేకపోయింది. బీఆర్‌ఎస్ అభ్యర్థి విజయుడు మొదటి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు ఆధిక్యంలోనే కొనసాగారు. ప్రత్యేక రాష్ట్రంలో జరిగిన మూడు ఎన్నికల్లో రెండోసారి విజయాన్ని బీఆర్‌ఎస్ తన ఖాతాలో వేసుకుంది. అభ్యర్థుల మధ్య ఉత్కంఠ పోరు ఉంటుందని అందరూ భావించినా.. ఓటర్లు మాత్రం ఏకపక్షంగా నిలిచి గెలుపును సునాయసంగా మార్చారు. దీంతో బీఆర్‌ఎస్ భారీ మెజార్టీని దక్కించుకుంది.
సాయంత్రం వరకు సాగిన లెక్కింపు..
జిల్లాకేంద్రంలోని గోనుపాడు వద్ద ఉన్న పాలిటెక్నిక్ కళాశాలలో ఆదివారం సాయంత్రం వరకు ఓట్ల లెక్కింపు జరిగింది. ఎన్నికల కౌంటింగ్ అబ్జర్వర్ అనురాధ, ఆర్‌ఓ చంద్రకళ స్ట్రాంగ్‌రూం నుంచి ఈవీఎంలను కౌంటింగ్ హాల్‌కు తీసుకొచ్చారు. రౌండ్లవారీగా ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించా రు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించారు.
14 టేబుల్స్ ఏర్పాటు చేసి 21 రౌండ్లలో లెక్కింపు చేపట్టారు. చివరగా వీవీప్యాట్లలోని స్లిప్‌లను లెక్కించి చివరి రౌండ్ ఫలితాలు వెల్లడించారు.
ఆది నుంచి అధిక్యమే..
పోటీలో 13 మంది అభ్యర్థులు ఉండగా.. ప్రధాన పోరు బీఆర్‌ఎస్–కాంగ్రెస్ మధ్యే కొనసాగింది. తొలి రౌండ్ నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్ధి విజయుడు కాంగ్రెస్ అభ్యర్థి సంపత్‌కుమార్‌పై అధిక్యత కనబరుస్తూ 30,573 ఓట్ల భారీ మెజార్టీతో విజయ కేతనం ఎగురవేశారు. ఈవీఎంలు లెక్కించగా 1,03,770 ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 290 వచ్చాయి.