
మురుగు పాలిటీలు..!
జిల్లా కేంద్రమైన గద్వాలలో పడకేసిన పారిశుద్ధ్యం
● చిన్నపాటి వర్షానికే డ్రెయినేజీలు నిండి రోడ్లపైకి చేరుతున్న మురుగు
● రోజుల తరబడి కాల్వల్లో పేరుకుపోతున్న పూడిక
● కంపుకొడుతున్న కాలనీలు
గద్వాలటౌన్: జిల్లా కేంద్రమైన గద్వాల మున్సిపాలిటీలో కొన్ని వార్డుల్లో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. వర్షం, వరద నీరు సాఫీగా వెళ్లడానికి నిర్మించిన వరద, మురుగునీటి కాల్వలతోపాటు డ్రైనేజీలు ఇష్టానుసారంగా నిర్మించడంలో సమస్య జఠిలంగా మారింది. మున్సిపాలిటీలోని 37 వార్డులతోపాటు ప్రధాన రహదారుల వెంట డ్రైనేజీలు నిర్మించిన తీరు చూస్తే ఆయా ప్రాంతవాసులు ఆగ్రహించే పరిస్థితి నెలకొంది. కృష్ణవేణి చౌరస్తా నుంచి సత్యసాయి మందిరం వరకు ఉన్న పెద్ద డ్రెయినేజీలో పూడిక పేరుకుపోయింది. కుంటవీధిలోని డ్రెయినేజీల పరిస్థితి సరేసరి. దీంతో ఆ పరిసరాలు దుర్గంధంగా మారాయి. సుంకులమ్మమెట్టు, కుంటవీధి, ఓంటెలపేట, గంటగేరి, వడ్డేగేరి, చింతలపేట తదితర ప్రాంతాల్లో పూడిక, వ్యర్థాపదార్థలు పేరుకపోయాయి. పట్టణ నడిబొడ్డున ఉన్న కందకం మురుగుకూపంగా మారింది.

మురుగు పాలిటీలు..!