
ప్రజాస్వామ్య రక్షణే జై సంవిధాన్ లక్ష్యం
పాన్‌గల్: ప్రజాస్వామ్య రక్షణే జై బాపు, జై భీ, జై సంవిధాన్ లక్ష్యమని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర సోమవారం మండలంలోని మల్లాయిపల్లి, చింతకుంటలో సాగింది. ఈ సందర్భంగా మంత్రి ఆయా గ్రామాల్లోని అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి మాట్లాడారు. రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత అందరిపై ఉందని.. మహాత్మాగాంధీ వారసత్వం, డా. బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా జై సంవిధాన్ యాత్ర చేపడుతున్నట్లు పేర్కొన్నారు. దేశ రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గాంధీ, అంబేడ్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందన్నారు.
అర్హులందరికీ రైతు భరోసా..
రైతు భరోసా అందని రైతులు ఆందోళన చెందవద్దని.. గ్రామాల వారీగా అర్హుల వివరాలు సేకరించి న్యాయం చేస్తామని మంత్రి జూపల్లి అన్నారు. సోమవారం మండల కేంద్రానికి వచ్చిన మంత్రికి సీపీఎం మండల కార్యదర్శి బాల్యానాయక్ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల రైతులు అర్హత ఉన్న రైతు భరోసా రాలేదని.. మంజూరు చేయించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 1.50 కోట్ల ఎకరాలకుగాను ఇప్పటి వరకు 1.46 కోట్ల ఎకరాలకు రైతు భరోసా జమ చేసినట్లు తెలిపారు. 9 రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు.
బాలికల విద్యకు ప్రాధాన్యం..
కాంగ్రెస్ ప్రభుత్వం బాలికల విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని కస్తూర్బా విద్యాలయంలో రూ.81 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులు, విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల గదులను మంత్రి ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమయం చాలా విలువైందని, వినియోగించుకొని లక్ష్యానికి అనుగుణంగా చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని సూచించారు. విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని.. సమయం విలువ, గెలుపు సాధించే వరకు విశ్రమించకూడదని తెలిపే పాటలను సెల్‌ఫోన్‌లో విద్యార్థులకు వినిపించారు. ప్రతి విద్యార్థికి ఈత తప్పక వచ్చి ఉండాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్దన్‌సాగర్, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీఈఓ అబ్దుల్ ఘనీ, జీసీడీఓ సుబ్బలక్ష్మి, ఎంఈఓ శ్రీనివాసులు, తహసీల్దార్ అబ్రహంలింకన్, ఎంపీడీఓ గోవింద్‌రావు, ఎస్‌ఓ హేమలత, ఏపీ ఎం వెంకటేష్‌యాదవ్, కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.