ఉండవెల్లి: పంట మార్పిడితో అధిక దిగుబడులు సాధించవచ్చని, ప్రతి రైతు ఇది పాటించాలని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో జాతీయ ఆహార భద్రత పథకం ద్వారా పప్పు ధాన్యాలు, తృణధాన్యాల మినీ కిట్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా కందుల పాకెట్లను రైతులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈమేరకు నియోజకవర్గంలోని ఉండవెల్లి, మానవపాడు, అలంపూర్, ఇటిక్యాల, ఎర్రవల్లి మండలాలకు చెందిన రైతులకు కందుల మినీ బ్యాగులను అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో ఏఈఓలు పంటలను పరిశీలించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, లేదంటే రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని సూచించారు. వ్యవసాయ అధికారులు రైతులకు నిత్యం అందుబాటులో ఉండాలని.. మేలు చేసే విధంగా వ్యవహరించాలని, రైతులకు సహకరించాలని తెలిపారు. రైతులందరు వేసిన పంటను వెయ్యకుండా జాగ్రత్తలు పాటించి, పంట మార్పిడి చేయ్యాలని ఎమ్మెల్యే అన్నారు. నాలుగు రకాల కందులను రైతులు సాగు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఏఓలు అనిత, రవి, నాగర్జున, పీఎసీఎస్ చైర్మన్ గజేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఆర్టీసీ అభివృద్ధికి కష్టపడి పనిచేయాలి
స్టేషన్ మహబూబ్‌నగర్: ఆర్టీసీ సంస్థ అభివృద్ధి కోసం ఉద్యోగులు కష్టపడి పనిచేయాలని డిప్యూటీ రీజినల్ మేనేజర్ లక్ష్మిధర్మ అన్నారు. జిల్లాకేంద్రంలోని డిపోలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లకు సోమవారం త్రైమాసిక అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను మిగతా వారు స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ఆర్టీసీలో ప్రమాదాల శాతాన్ని తగ్గించాలని సూచించారు. ఆర్టీసీ టూర్ ప్యాకేజీలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, మీ అనుకూలమైన సమయాల్లో వీటి గురించి గ్రామాల్లో, కాలనీల్లో ప్రచారం చేయాలని కోరారు. టూర్ ప్యాకేజీల వల్ల అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో టూటౌన్ సీఐ ఎజాజుద్దీన్, డిపో మేనేజర్ సుజాత, సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.
రెడ్‌క్రాస్ సేవలు విస్తృతం చేయాలి
గద్వాల: జిల్లాలో రెడ్‌క్రాస్ సొసైటీ సేవలు విస్తృతం చేయాలని, ఇందుకు జిల్లా యంత్రాంగం తరపున అన్ని విధాలుగా సహకారం అందిస్తామని కలెక్టర్ సంతోష్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించగా కలెక్టర్ హాజరయ్యారు. ముందుగా సర్ జీన్ హెన్రీ డ్యూ నాంట్ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రెడ్‌క్రాస్ సేవా కార్యక్రమాలు అత్యంత అభినందనీయమైనవి అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీ నారాయణ, కో– ఆపరేటివ్ అధికారి శ్రీనివాస్, రెడ్‌క్రాస్ సోసైటీ చైర్మన్ రమేష్, రాష్ట్ర ఈ.సి మెంబర్ మోహన్‌రావు, వైస్ చైర్మన్ తాహిర్, తదితరులు ఉన్నారు.

పంట మార్పిడితో అధిక దిగుబడులు