ధర నిర్ణయం..
సాక్షిప్రతినిధి, వరంగల్:
తునికాకు సేకరణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈమేరకు స్టాండర్డ్ బ్యాగుకు రూ.3,300 ధరను ఖరారు చేస్తూ అటవీశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా ఆరు సర్కిళ్ల పరిధిలో 104 యూనిట్ల ద్వారా ఈ బీడి ఆకు సీజన్‌లో ఆకుసేకరణ చేయనున్నట్లు అధికారులు ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. కాళేశ్వరం, కవ్వాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్) మంచిర్యాల, బాసర, రాజన్న, భద్రాద్రి, చార్మినార్ సర్కిళ్లలో 104 యూనిట్లు ఏర్పాటు చేసి 1,22,000 స్టాండర్డ్ బ్యాగు (ఎస్‌బీలు)లు కొనుగోలు లక్ష్యంగా ప్రకటించారు. అయితే, అటవీశాఖ ఉమ్మడి వరంగల్ (కాళేశ్వరం, భద్రాద్రి సర్కిళ్లు) 14 డివిజన్లల పరిధి ఎనిమిది డివిజన్లలో 77 యూనిట్ల ద్వారా 80,200 స్టాండర్డ్ బ్యాగుల ఆకు సేకరణే లక్ష్యంగా పెట్టుకున్నారు.
సేకరణకు రూ.54.90 కోట్లు
తునికాకు సీజన్ కోసం ప్రభుత్వం మంజూరు చేసిన మొత్తం బడ్జెట్ రూ. 54.90 కోట్లు వివిధ విభాగాలకు కేటాయించింది. ఇందులో తునికాకు సేకరణకు స్టాండర్డ్ బ్యాగు (ఎస్‌బీ)కి రూ.3,300 చొప్పున రూ.40.26 కోట్లు కాగా, ఇది మొత్తం బడ్జెట్‌లో అతిపెద్ద వాటా. నిర్ణీత ధర రూ.3,300 చొప్పున 1,22,000 స్టాండర్డు బ్యాగుల సేకరణ కోసం ఈ నిధులు కేటాయించారు. అదేవిధంగా సర్కిల్, డివిజన్ కార్యాలయాల్లో డేటా ఎంట్రీ, మానిటరింగ్ పనుల కోసం 12 నెలల కాలానికి ఔట్‌సోర్సింగ్ సిబ్బంది కోసం రూ.4.90 కోట్లు, గోదాం రికార్డు కీపర్లు, టీఎంలకు 45 రోజుల కోసం రూ.5 లక్షలు కేటాయించారు. మిగతా రూ.14,54,10,000లు కార్యాలయ, అటవీశాఖ క్వార్టర్ల నిర్వహణ, పోస్టల్, విద్యుత్, మున్సిపల్ పనులు, టెలిఫోన్, వాహనాలు తదితర అవసరాల కోసం ఖర్చు చేయనున్నారు.
తగ్గిన యూనిట్లు!
ఐదేళ్ల క్రితంకు ఇప్పటికీ తునికాకు యూనిట్లు గణనీయంగా తగ్గింది. 309 యూనిట్ల ద్వారా 3,569 కల్లాలు ఏర్పాటు 5,42,70 స్టాండర్డు బ్యాగుల ఆకు సేకరణ చేసేవారు. నూటికి నూరు శాతం లక్ష్యాలు నెరవేరగా, రాను రానూ 243 యూనిట్లు, 2,41,700 స్టాండర్డ్ బ్యాగులకు పడిపోయింది. ఈఏడాది మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 104 యూనిట్లు, 1,22,000 స్టాండర్డ్ బ్యాగుల సేకరణ లక్ష్యం కాగా.. ఉమ్మడి వరంగల్‌లో 8 డివిజన్లలోనే ఆకు సేకరించనున్నారు. ఆకు సేకరణ లక్ష్యాలు తగ్గడం ద్వారా ఉపాధి కూలీలు ఆదాయం, పనిదినాలు కోల్పోతున్నారు. ఇదిలా ఉండగా ఫ్రూనింగ్ (కొమ్మలు కొట్టె) ఈ నెలాఖరు వరకు ముగియనుండగా, అటవీశాఖ అధికారులు, కాంట్రాక్టర్లు మే 1 నుంచి తునికాకు సేకరణ ప్రారంభించి సుమారు 30–45 రోజుల్లో ఆకు సేకరణ పూర్తి చేసేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఈసారి ఆకు సేకరణ చేసిన కూలీలకు స్టాండర్డ్ బ్యాగు (50 ఆకుల కట్టలు వెయ్యి)కు రూ.3,300 చెల్లించనున్నట్లు అధికారులు ఆ ఉత్తర్వుల్లో వెల్లడించారు. తెలంగాణ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ (రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్) చట్టం, 1971లోని సెక్షన్ 7 ప్రకారం, సలహా కమిటీతో సంప్రదించిన తర్వాత ప్రభుత్వం ఈ ధరలను ఖరారు చేసింది. ఈ లెక్కన ఆకు సేకరణ కోసం రూ.54.90 కోట్లు విడుదల చేశారు. కాళేశ్వరం సర్కిల్ పెద్దపల్లి, జేఎస్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మహదేవపూర్, భూపాలపల్లి, ములుగు, తాడ్వాయి, వెంకటాపురం, ఏటూరునాగారం డివిజన్లలో 37 యూనిట్ల ద్వారా 32,900 స్టాండర్డ్ బ్యాగులు కొనుగోలు చేయనున్నారు. భద్రాద్రి సర్కిల్ కేజీఎం భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లోని భద్రాచలం, మణుగూరు, పాల్వంచ, కేడబ్ల్యూఎస్ కిన్నెరసాని, కొత్తగూడెం, ఇల్లందు అటవీశాఖ డివిజన్లలో 40 యూనిట్లలో 47,300, చార్మినార్ సర్కిల్‌లో మూడు యూనిట్ల ద్వారా 800 స్టాండర్ట్ బ్యాగుల బీడీ ఆకు సేకరించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అహ్మద్ నదీం ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. కాగా, బీడీ ఆకు సేకరణ వ్యవహారంలో తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీఎఫ్‌డీసీఎల్) ప్రభుత్వ ఏజెంట్‌గా వ్యవహరించనుంది.


