భూపాలపల్లి రూరల్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం స్పూర్తిగా జిల్లాను అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. అంబేడ్కర్ 135 జయంతిని పురస్కరించుకుని ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ అయిత ప్రకాశ్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల ప్రతినిధులతో కలిసి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. రూ.7కోట్లతో అంబేడ్కర్ భవనం, రూ.2కోట్లతో రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించేందుకు గణపురం మండలం మైలారంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను నిర్మిస్తున్నామని తెలిపారు. భూపాలపల్లి నుంచి గూడెప్పాడు వరకు రూ.664 కోట్లతో నాలుగు వరుసల రహదారి నిర్మాణం చేయనున్నామని తెలిపారు. బైపాస్ రహదారి నిర్మాణానికి రూ.500 కోట్ల మంజూరు చేసినట్లు వివరించారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. ఈ రోజు ఇంత స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామంటే అది రాజ్యాంగం మనకు కల్పించిన రక్షణ అని అన్నారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మాట్లాడుతూ.. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, వివక్ష లేనటువంటి సమ సమాజ స్థాపన చేయడం కోసం అంబేడ్కర్ విశేషంగా కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, ఎస్సీ అభివృద్ధి అధికారి ఇందిర, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, ఆర్డీఓ హరికృష్ణ పాల్గొన్నారు.
జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర


