ఆర్టీసీ సమ్మెకు జేఏసీ పిలుపు | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ సమ్మెకు జేఏసీ పిలుపు

Apr 15 2026 7:50 AM | Updated on Apr 15 2026 7:50 AM

భూపాలపల్లి అర్బన్‌: సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 22వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపు ఇచ్చినట్లు ఎంప్లాయీస్‌ యూనియన్‌ డిపో అధ్యక్షుడు దుండ్ర రాజయ్య తెలిపారు. ఈ మేరకు డిపో ఎదుట మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, పీఆర్సీ అమలు, ఉద్యోగ భద్రత కల్పన, ఖాళీలను వెంటనే భర్తీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ ఎలక్ట్రిక్‌ బస్సులను దశలవారీగా ప్రవేశపెడుతున్నట్లు విమర్శించారు. ఆరు గ్యారంటీల అమలులో భాగంగా మహాలక్ష్మి పథకాన్ని విజయవంతం చేయడంలో ఆర్టీసీ కార్మికులు శక్తికి మించి పనిచేస్తున్నారని తెలిపారు. అయినప్పటికీ శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం, అధికారుల వేధింపులు, కక్ష సాధింపు చర్యలు, యూనియన్ల పునరుద్ధరణ లేకపోవడం వంటి సమస్యలపై పలు మార్లు ప్రభుత్వానికి, మంత్రులకు వినతి పత్రాలు సమర్పించినా స్పష్టమైన హామీలు రాకపోవడంతో జేఏసీ నాయకులు సమ్మె బాట పట్టాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. సమ్మెలో పూర్తిస్థాయిలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు బుర్రి తిరుపతి, రాధాకృష్ణ, బండి శ్రీనివాస్‌, ఎల్లా గౌడ్‌, సమ్మయ్య, మధు, ఏకే స్వామి, రంజిత్‌ గౌడ్‌, కృష్ణమూర్తి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement