● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
భూపాలపల్లి: నేటి యువత అంబేడ్కర్ ఆశయాలను లోతుగా అర్థం చేసుకుని వాటిని ఆచరణలో పెట్టాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత, మహానీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 135వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అంబేడ్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ డాక్టర్ భీంరావ్ రాంజీ అంబేడ్కర్ భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే మహానీయుడని పేర్కొన్నారు. ఆయన ప్రతిభావంతమైన న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా గొప్ప సంఘ సంస్కర్తగా సేవలందించారని తెలిపారు. ముఖ్యంగా సమాజంలో ఉన్న అంటరానితనం, కుల వివక్ష నిర్మూలన కోసం జీవితాంతం పోరాడిన మహోన్నత వ్యక్తిగా కొనియాడారు. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన కృషి అపారమని, సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ వంటి విలువలను సమాజంలో స్థాపించడంలో ఆయన పాత్ర అత్యంత గొప్పదని వివరించారు. సమానత్వం, సామాజిక న్యాయం, విద్య ప్రాముఖ్యత వంటి విలువలను జీవితంలో అనుసరించి మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు. దేశాభివద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలంటే అంబేడ్కర్ ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్‌కుమార్, డీఎస్పీ సంపత్‌రావు, ఆర్‌ఐ రత్నం, ఆర్‌ఎస్‌ఐ ఫిరోజ్ తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


