భూపాలపల్లి: రోజురోజుకూ పెరుగుతున్న ఎండలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ రాహుల్‌శర్మ సూచించారు. ఎండల బారినుంచి రక్షణపై సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వాతావరణ శాఖ జిల్లాను ఆరంజ్ జోన్‌గా ప్రకటించినట్లు తెలిపారు. జిల్లాలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రజలు బయటకు వెళ్లొద్దని సూచించారు. చిన్నారులు, వయోవృద్ధులు ఎండ సమయంలో ప్రయాణం చేయొద్దన్నారు. అనంతరం వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో కాటారం సబ్‌కలెక్టర్ మయాంక్‌సింగ్, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఏఎస్పీ నరేష్‌కుమార్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ మధుసూదన్, అధికారులు పాల్గొన్నారు.
పనులు పూర్తిచేయాలి..
ఏప్రిల్ 30వ తేదీ వరకు సరస్వతి అంత్య పుష్కరాలకు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ సూచించారు. మే 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు కాళేశ్వరంలో జరుగనున్న సరస్వతి అంత్య పుష్కరాల పనులపై సోమవారం సచివాలయం నుంచి దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, ధార్మిక సలహాదారు గోవిందహరి, ఆర్కిటెక్చర్ సూర్యనారాయణతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐడీఓసీ కార్యాలయం నుంచి కలెక్టర్ రాహుల్ శర్మ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. తాత్కాలిక ప్రాతిపదికన చేపట్టబోయే పనులు 15 రోజుల ముందే పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంకా టెండర్లు పూర్తికాని పనులకు టెండర్లు పిలవాలని, టెండర్లు పూర్తయిన పనులకు నిధులు మంజూరు చేయాలని కలెక్టర్‌కు సూచించారు.
రహదారి నియమాలు పాటించాలి..
రహదారి నియమాలు పాటిస్తూ వాహనదారులు బాధ్యతతో వాహనాలు నడిపితే ప్రమాదాలను సమర్థవంతంగా నివారించవచ్చని కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో రెవెన్యూ, పోలీస్, రవాణా, ఆర్‌అండ్‌బీ, మున్సిపల్, పంచాయతీరాజ్, వైద్య శాఖల అధికారులతో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అధిక వేగాన్ని నియంత్రించడం, హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం వంటి చర్యలు ప్రమాదాల తగ్గింపునకు కీలకమని తెలిపారు. ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఎన్యుమరేటర్ల నియామకం పూర్తి..
జనగణన కార్యక్రమానికి సంబంధించి సూపర్‌వైజర్లు, ఎన్యూమరేటర్ల నియామక ప్రక్రియను పూర్తిచేసినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు. సోమవారం హైదరాబాద్ నుంచి కులగణన సంచాలకులు భారతి హోళికేరి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఐడీఓసీ కార్యాలయం నుంచి కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు.
విద్యార్థినికి అభినందన..
చిట్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థిని నరాల అంజలి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంకు సాధించినందుకు గాను సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో కలెక్టర్ రాహుల్ శర్మ అభినందించారు.
అలసత్వం వద్దు..
ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం వహించకుండా పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 88 దరఖాస్తులు స్వీకరించారు.
రహదారి నియమాలు పాటించాలి
కలెక్టర్ రాహుల్ శర్మ


