భూపాలపల్లి: ‘అలైవ్–అరైవ్’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 15వ తేదీన జిల్లాలోని సర్పంచ్‌లు, మున్సిపల్ కౌన్సిలర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అవగాహన కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని పుష్పగ్రాండ్‌లో నిర్వహిస్తామని, ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుందన్నారు. రహదారి భద్రత, సైబర్ నేరాల నివారణ, మత్తుపదార్థాల నియంత్రణ, సీసీటీవీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరవుతారని ఎస్పీ సంకీర్త్ వెల్లడించారు.
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో టెన్త్ పరీక్షలు విజయవంతంగా ముగియడం పట్ల కలెక్టర్ రాహుల్‌శర్మ హర్షం వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గత నెల 14వ తేదీన ప్రారంభమైన పరీక్షలు జిల్లాలో సజావుగా కొనసాగి, విద్యార్థులు ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాసినట్లు తెలిపారు. ఎండలను దృష్టిలో ఉంచుకుని ప్రతి పరీక్షా కేంద్రంలో అత్యవసర వైద్య సదుపాయాలు కల్పించినట్లు, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. పరీక్షల నిర్వహణలో ఉపాధ్యాయులు, శాఖాధికారులు, సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో సమర్థవంతంగా విధులు నిర్వహించినందుకు కలెక్టర్ అభినందించారు.
భూపాలపల్లి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయుల, కార్మిక, పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈజేఎసీ) ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ రాహుల్‌శర్మకు వినతిపత్రం అందజేశారు. టీజీఈజేఏసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బురుగు రవి, విజయలక్ష్మి మాట్లాడుతూ.. ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి ఈ నెల 17న నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. టీజీఈజేఏసీ రాష్ట్ర కమిటీ ఇటీవల తీసుకున్న నిర్ణయాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల సమస్యలపై నిరసనలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టరేట్ వద్ద మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలతో నిరసన నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, పెన్షనర్లు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘాల నాయకులు డాక్టర్ మధుసూదన్, శ్రీనివాస్, సుభాకర్‌రెడ్డి, శ్రీనివాసులు, సురేందర్‌రెడ్డి, పోచయ్య, తిరుపతి, కుమారస్వామి పాల్గొన్నారు.
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ఆధ్వర్యంలో నిర్వహించనున్న టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి ఆదేశించారు. పరీక్షలు విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా స్థాయి సమన్వయ సమావేశం సోమవారం కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీసు శాఖ, వైద్య, ఆరోగ్య, విద్యుత్, పంచాయతీరాజ్, పోస్టల్, మున్సిపల్, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. ఈ నెల 20నుంచి 26 వరకు జరిగే పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ ఉదయ్‌కుమార్, డివిజనల్ పంచాయతీ అధికారి మల్లికార్జునరెడ్డి, సీఐ నరేష్‌కుమార్, ప్రభుత్వ పరీక్షల నియంత్రణ అధికారి సామల రమేష్, తదితరులు పాల్గొన్నారు.


