ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలి

Apr 12 2026 3:48 AM | Updated on Apr 12 2026 3:48 AM

కలెక్టర్‌ రాహుల్‌ శర్మ

భూపాలపల్లి: యువత చదువు, క్రీడలపై దృష్టి సారించి ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని, వ్యసనాలకు బానిసలై భవిష్యత్‌ నాశనం చేసుకోవద్దని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ సూచించారు. ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కల్పించేందుకు శనివారం జిల్లాకేంద్రంలోని రాజీవ్‌ చౌక్‌ నుంచి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సెంటర్‌ వరకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌తో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ రాహుల్‌ శర్మ మాట్లాడుతూ.. డ్రగ్స్‌ సమస్య సమాజానికి పెద్ద ముప్పుగా మారిందని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత డ్రగ్స్‌కు బానిసలై తమ భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. డ్రగ్స్‌ బానిసల కోసం ప్రభుత్వం ప్రత్యేక డీ–అడిక్షన్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తుందన్నారు. మన జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రిలో డీ–అడిక్షన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయబడుతుందని వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ.. డ్రగ్స్‌ రవాణా, విక్రయం, వినియోగంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. యువత చెడు అలవాట్లకు లోనవకుండా తమ జీవితాలను సవ్యంగా మలుచుకోవాలని సూచించారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ మాట్లాడుతూ.. డ్రగ్స్‌ నివారణకు పోలీసు శాఖ ద్వారా గ్రామ గ్రామాన అవగాహన కార్యక్రమాలు పెద్దఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో గంజాయి రవాణాదారులు, విక్రేతలపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. యువత డ్రగ్స్‌పై అవగాహన లేకుండా సరదా కోసం తీసుకుంటూ కొద్దికొద్దిగా ఆ రొంపిలోకి దిగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం 2 కే రన్‌లో పాల్గొన్న విజేతలకు ప్రశంసా పత్రాలు అందచేశారు. ఈ ర్యాలీలో మున్సిపల్‌ చైర్మన్‌ బుర్ర కొమురయ్య, వైస్‌ చైర్మన్‌ అంబాల శ్రీనివాస్‌, డీఎంహెచ్‌ఓ మధుసూదన్‌, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పావని, కౌన్సిలర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

మత్తు పదార్థాలకు అలవాటు కావొద్దు

యువత మత్తు పదార్థాలకు అలవాటు కావొద్దని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ సూచించారు. ‘అరైవ్‌–అలైవ్‌’ కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి పట్టణంలో డ్రగ్స్‌ వ్యతిరేఖ అవగాహన 2కే రన్‌, ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌, ఎస్పీ మాట్లాడుతూ.. డ్రగ్స్‌ వినియోగం వ్యక్తిగత జీవితం మాత్రమే కాకుండా సమాజానికి హానికరమన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. రోడ్డు భద్రతా నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ బుర్ర కొమురయ్య, వైస్‌ చైర్మన్‌ అంబాల శ్రీనివాస్‌, డీఎంహెచ్‌ఓ మధుసూదన్‌, అడిషనల్‌ ఎస్పీ నరేష్‌కుమార్‌, డీఎస్పీ సంపత్‌రావు, సీఐ డి.నరేష్‌కుమార్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement