భానుడి ప్రతాపం | - | Sakshi
Sakshi News home page

భానుడి ప్రతాపం

Apr 11 2026 8:28 AM | Updated on Apr 11 2026 8:28 AM

భానుడి ప్రతాపం

ఏసీలు, కూలర్లకు

డిమాండ్‌..

నిప్పుల కొలిమిలా సింగరేణి కోల్‌బెల్ట్‌

భూపాలపల్లి: భానుడు ఇప్పుడే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. సింగరేణి కోల్‌బెల్ట్‌ ప్రాంతంలో ఎండలు మండిపోతున్నాయి. మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల నుంచి 40 డిగ్రీల మధ్య నమోదు అవుతుండటంతో జనం విలవిలలాడుతున్నారు. బొగ్గు గనులు, పారిశ్రామిక ప్రాంతం కావడంతో సెగలు మరింత ఎక్కువగా ఉండి, సామాన్య ప్రజలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.

నిర్మానుష్యంగా మారుతున్న వీధులు..

ఉదయం 9 గంటలు దాటితే చాలు, సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రోడ్లన్నీ కర్ఫ్యూను తలపిస్తున్నాయి. ప్రధాన కూడళ్లు, జాతీయ రహదారులు వాహనాలు లేక వెలవెలబోతున్నాయి. అత్యవసర పనులు ఉన్నవారు మాత్రమే ముఖానికి రుమాళ్లు కట్టుకుని బయటకు వస్తున్నారు. ప్రజలు తమ పనులను ఉదయం వేళల్లోనే ముగించుకుని, మధ్యాహ్నం అంతా ఇళ్లకే పరిమితం అవుతున్నారు.

ఓసీ కార్మికుల ఇబ్బందులు..

సింగరేణి ఉపరితల గనులు(ఓపెన్‌కాస్ట్‌)ల్లో పని చేస్తున్న కార్మికులు ఎండ వేడిమిని తట్టుకోలేకపోతున్నారు. ఎండ నేరుగా వారిపైనే పడుతుండటంతో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఎండను తట్టుకోలేక కొంతమంది కార్మికులు విధులకు హాజరుకాకపోవడంతో గైర్హాజరు శాతం ఓపెన్‌కాస్ట్‌ల్లో పెరుగుతుంది. రాత్రిషిఫ్టు కార్మికులు మాత్రం గతంలో మాదిరిగానే హాజరవుతున్నారని అధికారులు తెలుపుతున్నారు.

జాగ్రత్తలు తప్పనిసరి

పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు వడదెబ్బకు గురికాకుండా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అవసరమైతే తప్ప మధ్యాహ్న సమయాల్లో బయటకు రావద్దని సూచిస్తున్నారు. డీహైడ్రేషన్‌కు గురికాకుండా తరచూ నీళ్లు, పండ్ల రసాలు తీసుకోవాలని, ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొంటున్నారు. మున్ముందు ఎండల తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుండటంతో, సింగరేణి ప్రాంతవాసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం.

ఎండల తీవ్రత పెరగడంతో గృహోపకరణాల మార్కెట్‌ ఒక్కసారిగా పుంజుకుంది. వారం రోజులుగా ఏసీలు, ఎయిర్‌ కూలర్ల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. షోరూంలన్నీ కస్టమర్లతో కిటకిటలాడుతున్నాయి. పేద, మధ్యతరగతి ప్రజల ఫ్రిజ్‌గా పిలవబడే మట్టి కుండలు, రంజన్లకు డిమాండ్‌ పెరిగింది. ఆరోగ్యం దృష్ట్యా కూడా చాలామంది వీటినే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

శీతల పానీయాలు:

దాహం తీర్చుకోవడానికి ప్రజలు కొబ్బరి నీళ్లు, మజ్జిగ, పుచ్చకాయలు, ఇతర శీతల పానీయాలు తీసుకుంటున్నారు.

రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

ఇళ్లకే పరిమితం అవుతున్న ప్రజలు

నిర్మానుష్యమవుతున్న ప్రధాన కూడళ్లు

Advertisement
 
Advertisement
Advertisement