మల్హర్(కాటారం): భూ వివాదాల పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ, ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. కాటారం డివిజన్ రెవెన్యూ, అటవీ, బుల్క్ భూ సమస్యలపై శుక్రవారం కాటారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ, అటవీ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డుల శాఖల అధికారులతో మండలాల వారీగా రెవెన్యూ, అటవీ భూ సమస్యలు, బుల్క్ భూ సమస్యలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అటవీ, రెవెన్యూ భూముల సరిహద్దుల నిర్ధారణలో స్పష్టత తీసుకురావడానికి సంయుక్త సర్వే కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వేగంగా సమస్యలను పరిష్కరించేందుకు శాఖల మధ్య సమన్వయం పెంచాలని ఆదేశించారు. భూ సంబంధిత పెండింగ్ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి కేసును పారదర్శకంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలి
వేసవి నేపథ్యంలో మండలాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని మిషన్ భగీరీథ, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను కలెక్టర్ రాహుల్‌శర్మ ఆదేశించారు. శుక్రవారం కాటారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో తాగునీటి సరఫరాపై మిషన్ భగీరథ, ఆర్‌డబ్ల్యూఎస్, విద్యుత్, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. నీటి కొరత ఉన్న ప్రాంతాలను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
స్టేడియం పనులను పూర్తిచేయాలి
ఇండోర్ స్టేడియం పనులను త్వరితగతన పూర్తిచేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సంబందిత అధికారులను ఆదేశించారు. కాటారం మండలకేంద్రంలో నిర్మిస్తున్న ఇండోర్ స్టేడియం పనులను కలెక్టర్ రాహుల్‌శర్మ అధికారులతో కలిసి పరిశీలించారు. స్టేడియం పనులు నత్తనడకన సాగడంపై ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని త్వరితగతిన పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. అనంతరం కాటారం మండలకేంద్రంలోని ఆర్టీసీ బస్‌షెల్టర్ స్థలాన్ని పరిశీలించి తహసీల్దార్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, జిల్లా యువజన, క్రీడల అధికారి రఘు, డివిజన్ తహసీల్దార్‌లు, ఎంపీడీఓలు, మిషన్ భగీరథ, ఆర్‌డబ్ల్యూఎస్, విద్యుత్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం
భూపాలపల్లి అర్బన్: యోగా సాధన ద్వారా శారీరకంగా మానసికంగా ఆరోగ్యం మెరుగుపడుతుందని కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, ఆరోగ్య వారోత్సవం, హోమియోపతి డేని పురస్కరించుకొని శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఇల్లందు క్లబ్‌లో ఆయూష్ శాఖ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఒత్తిడిని జయించడానికి యోగా అద్భుతమైన సాధనమని తెలిపారు. ప్రతిరోజూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకుని క్రమం తప్పక సాధన చేసుకోవాలని సూచించారు. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ వల్ల ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంతో పాటు ఆయుష్ సేవలను ప్రజలకు మరింత చేరువచేయడానికి ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ఆరోగ్య వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు చిన్నతనం నుంచే ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రజలు ఒత్తిడి లేని జీవనం సాగించేందుకు యోగా చక్కగా పనిచేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయుష్ వైద్య విధానాల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, డీపీఆర్‌ఓ శ్రీనివాస్, ఆర్డీఓ హరికృష్ణ, తహసీల్దార్ లక్ష్మీరాజయ్య, రెడ్‌క్రాస్ చైర్మన్ శ్రీనివాస్, కౌన్సిలర్ అప్పం కిషన్, ఆయూష్, జిల్లా వైద్య బృందం, యోగా ఇన్‌స్ట్రక్టర్లు, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ


