తొలిపోరు నేడే..
నాలుగు మండలాల్లో ఎన్నికలు
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో మొదటి విడతలో గణపురం, రేగొండ, కొత్తపల్లిగోరి, మొగుళ్లపల్లి నాలుగు మండలాల్లో నేడు(గురువారం) ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎన్నికల నిర్వహణ సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు బుధవారం సాయంత్రం చేరుకున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఎన్నికలను నిర్వహించనున్నారు. నాలుగు మండలాల్లో 73 గ్రామ పంచాయతీలు, 559 వార్డు స్థానాలకు ఎన్నికలు నేడు పోలింగ్ జరుగనుంది. ఎన్నికల నిర్వహణకు 1,939 మంది పోలింగ్ అధికారులు, సిబ్బందిని కేటాయించారు. ఎన్నికలు జరిగే మండలాలు, గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నాలుగు మండలాలకు సుమారు 800 మంది పోలీస్ అధికారులు, సిబ్బందిని కేటాయించారు. సమస్యాత్మక గ్రామాల్లో అదనపు బలగాలను నియమించి భద్రతను మరింత పటిష్టం చేశారు.
2 గంటల నుంచి కౌంటింగ్
ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఓటింగ్.. అనంతరం అధికారులు 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు అన్ని గ్రామాల్లో ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. నాలుగు మండలాల్లో 1,14,007 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. సర్పంచ్ అభ్యర్థులుగా 259 మంది, వార్డు సభ్యులుగా 1,282 మంది పోటీలో ఉన్నారు.
పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది
ఎన్నికలు నిర్వహణకు అధికారులు సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. మండల కేంద్రాల్లో ఎంపీడీఓ కార్యాలయాల్లో బ్యాలెట్ బ్యాక్స్, ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాల్లో పోలీస్ భద్రతనడుమ ఎన్నికల నిర్వహణ అధికారులు, సిబ్బంది బుధవారం సాయంత్రం పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.
ఏర్పాట్ల పరిశీలన
మొదటి విడత ఎన్నికలు జరిగే నాలుగు మండలాల్లో బ్యాలెట్ బాక్స్‌లు, ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకుడు ఫణీంద్ర, కలెక్టర్ రాహుల్‌శర్మ అధికారులతో కలిసి పరిశీలించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. ఎక్కడైనా ఇబ్బంది ఉంటే వెంటనే ఉన్నతాధికారులకు సూచించాలని తెలిపారు.
73 సర్పంచ్, 559 వార్డు స్థానాలకు..
ఉదయం 7 గంటల నుంచి
మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్
మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్
సాధారణ ఎన్నికల పరిశీలకుడు ఫణీంద్ర రెడ్డి
గణపురం: మండలంలో మొదటి విడతలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా జరుపుకోవాలని సాధారణ ఎన్నికల పరిశీలకుడు ఫణీంద్రరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మండలంలో పోలింగ్ మెటీరియల్ పంపిణీ కేంద్రాన్ని పరిశీలించి, మాట్లాడారు. మెటిరీయల్ పంపిణీ కేంద్రాల్లో ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. పోలింగ్ ప్రక్రియ పారదర్శకంగా సాగేలా ప్రతి దశలో పని చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, ఎంపీడీఓ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
తొలిపోరు నేడే..
తొలిపోరు నేడే..


