జోరందుకున్న రెండో విడత ప్రచారం
సోషల్ మీడియా జోరు..
ఇక మిగిలింది
రెండురోజులే..
రెండో విడత ఎన్నికలు జరిగే మండలాలు
భూపాలపల్లి రూరల్: రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అభ్యర్థులు ఇప్పటికే పోటాపోటీగా ఓట్ల వేట ప్రారంభించారు. రెండోవిడత ఎన్నికల పోలింగ్ ఈ నెల 14న జరగనుంది. ఓటింగుకు 48 గంటల ముందే ప్రచారం నిలిపి వేయాల్సి ఉంటుంది. దీంతో బహిరంగ ప్రచారానికి ఒకరోజే మిగిలింది. సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి తమను గెలిపించాలని కోరుతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలు బలపరిచిన అభ్యర్థుల తరపున జిల్లా నాయకులు గ్రామాల్లోకి వెళ్లి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇప్పటికే పల్లెల్లో మైకులు, రికార్డింగ్ ఆడియోలతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రచారం చేయిస్తున్నారు. గెలుపు కోసం వాడవాడల్లో ప్రతీగడపకు తిరుగుతూ ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. మహిళలు, యువత ఓట్లు అధికంగా ఉన్న చోట్ల వారిపై ప్రత్యేక దృష్టి సారించి మద్దతు కోరుతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ తరఫున అభ్యర్థులతోపాటు స్వతంత్ర అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. సర్పంచ్, వార్డు స్థానాల్లో మద్దతుదారులతో కలిసి అందుబాటులో ఉన్న ఓటర్లను కలుస్తున్నారు.
వలస ఓటర్లకు ఫోన్లు..
గ్రామాల నుంచి పలు నగరాలు, పట్టణాలకు వలస వెళ్లిన వారిలో అనేకమంది ఓటర్లు ఉన్నారు. ఊళ్లో ఓటు ఉండి విద్య, ఉపాధి, ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌తోపాటు పొరుగు జిల్లాలకు వలస వెళ్లారు. ఆ ఓటర్లకు అభ్యర్థులు ఫోన్లు చేస్తూ బరిలో ఉన్నామని చెబుతూ మద్దతు కోరుతున్నారు. పోలింగ్ రోజు ఓటేసేందుకు గ్రామానికి రావాలని ముందుగానే ఓ మాట చెబుతున్నారు.
ఎన్నికల ప్రచారానికి కిక్కు..
అనుచరులతో అభ్యర్థులు ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఈసారి తప్పకుండా తమనే గెలిపించాలని కోరుతున్నారు. మహిళా అభ్యర్థుల పక్షాన భర్తలు మందుండి ప్రచారం చేస్తున్నారు. అనుచరులతోపాటు ఓటర్లకు దావతులు ఏర్పాటు చేసి ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు సమాచారం.
పంచాయతీ ఎన్నికల ప్రచారం సోషల్ మీడియాలో హోరెత్తుతోంది. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇస్ర్ట్రాగాం తదితర సామాజిక మాధ్యమాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. తమ గుర్తును వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేస్తున్నారు. ఎన్నికల కోసం ప్రత్యేకంగా గ్రూపులు ఏర్పాటు చేసి విస్తృతంగా పాటలు, వీడియోలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఒకరికి మించి ఒకరు అన్నట్లుగా పల్లెల్లో ఎన్నికలతో వాట్సాప్ గ్రూపులు నిండిపోతున్నాయి.
వేగం పెంచుతున్న
సర్పంచ్ అభ్యర్థులు
రంగంలోకి
జిల్లాస్థాయి
నాయకులు
ఇంటింటికీ
వెళ్తూ ఓటు
అభ్యర్థిస్తున్న
నేతలు
భూపాలపల్లి, టేకుమట్ల, చిట్యాల, పలిమెల
పంచాయతీలు 75
వార్డు స్థానాలు 547
సర్పంచ్ అభ్యర్థులు 254
వార్డు సభ్యుల అభ్యర్థులు 1,463


