తొలి పోరుకు సిద్ధం
పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
రేపు మొదటి విడత పంచాయతీ ఎన్నికలు
భూపాలపల్లి అర్బన్: తొలి దశ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలోని ఆరు మండలాల్లో మొదటి విడతలో 73 సర్పంచ్, 559 వార్డు స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. ఇప్పటికే సిబ్బందికి శిక్షణ సైతం పూర్తిచేసింది. గ్రామాల్లో ఎన్నికల ప్ర చారం మంగళవారం సాయంత్రంతో ముగిసింది.
4 మండలాల్లో ఎన్నికలు..
జిల్లాలో 248 గ్రామాలు ఉండగా, మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి విడతలో గణపురం, రేగొండ, కొత్తపల్లిగోరి, మొగుళ్లపల్లి మండలాల పరిధిలో 82 సర్పంచ్, 712 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, వీటిలో 9 సర్పంచ్, 153 వార్డుస్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగితా 73 సర్పంచ్ 559 వార్డు స్థానాలకు పోలింగ్ జరుగనుంది.
విధుల్లో 1,939 మంది సిబ్బంది
పోలింగ్‌కు ఎన్నికల సిబ్బందికి ఇప్పటికే శిక్షణ పూర్తి చేశారు. మొదటి విడతలో మొత్తం 1,939 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. వీరిలో 855 మంది ప్రిసైడింగ్ అధికారులు (పీఓలు) 1,084 మంది ఏపీఓలు, 77మంది రిటర్నింగ్ అధికారులు ఉన్నారు. వీరిలో మొత్తంగా 20శాతం మంది అధికారులు, సిబ్బందిని అదనంగా నియమించారు. అత్యవసరంగా ఎవరైనా విధుల నుంచి తప్పుకుంటే అదనంగా కేటాయించిన వారు విధుల్లో పాల్గొంటారు. వారితో పాటు 36మంది మైక్రోఅబ్జర్వర్లు, జోనల్ ఆధికారులు 14, ఫ్లయింగ్ స్వ్కాడ్‌లు ఎన్నికల విధుల్లో ఉంటారు.
800 మంది
పోలీసులతో బందోబస్తు
ఎన్నికల సందర్భంగా 800 మంది పోలీసులతో గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. మొదటి విడతలో 10 సమస్యాత్మక గ్రామాలను గుర్తించిన పోలీసులు, పంచాయతీరాజ్ తరఫున అన్నింటిలో సీసీ కెమెరాలతో పాటు ఒక ఎస్సై, అదనపు పోలీస్ బలగాలను నియమించారు. అదనపు ఎస్పీ, ప్రతి మండలానికి ఒక డీఎస్పీని కేటాయించారు. 30 మంది సీఐలు, 50 మంది ఎస్సైలు, స్పెషల్ ఫోర్స్, ఏఆర్, సివిల్‌తో పాటు మొత్తం 800 మంది పోలీసులను బందోబస్తుకు కేటాయించారు. ఎస్పీ, అదనపు ఎస్పీ ఎప్పటికప్పుడు ఎన్నికల నిర్వహణపై సమీక్షించనున్నారు.
ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభం
గురువారం ఉదయం ఆరు గంటలకు ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించి అనంతరం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించునున్నారు. ఒంటి గంట వరకు లైన్‌లో నిల్చున్న ఓటర్లకు మాత్రమే టోకెన్లు అందిస్తారు. ఆ తర్వాత వచ్చిన ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉండదు. రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపును ప్రారంభించనున్నారు.
జిల్లాలో జరగనున్న మొదటి విడత ఎన్నికలకు కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. ఎన్నికల విధులు కేటాయించి సిబ్బంది నేడు(బుధవారం) ఉదయం 10గంటలకు కేటాయించిన మెటీరియల్ పంపిణీ కేంద్రాలకు హాజరుకావాలని తెలిపారు. అనంతరం పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలన్నారు. ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించి పోలింగ్ ప్రారంభించాలన్నారు. ఎన్నికలు ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా ప్రతీ ఒక్కరు అత్యంత జాగ్రత్తతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలింగ్ సిబ్బందికి మూడో విడత ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకులు ఫణింద్రరెడ్డి, జిల్లా ఎన్నికల అఽధికారి, కలెక్టర్ రాహుల్‌శర్మ నిర్వహించారు.
73 సర్పంచ్..
559 వార్డు స్థానాలకు పోలింగ్
ఏర్పాట్లు పూర్తిచేసిన యంత్రాంగం
రేపు ఉదయం 7గంటల నుంచి
మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికలు
అనంతరం ఓట్ల లెక్కింపు


